ఖమ్మం వైరారోడ్: తెలంగాణలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసిందని. తద్వారా ఆ పార్టీ నైజం బయటపడిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు అమలుచేయలేదని ఆరోపిస్తూ ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్‌లో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టి, రైతుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తోందని, రైతు రుణమాఫీని కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా వారిని మోసం చేస్తోందన్నారు. కేసీఆర్ తిరిగి రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు, భూ దోపిడీలకు పాల్పడుతున్నారని, గతంలో ఖమ్మం జిల్లాలో ఒక్క మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం ముగ్గురు మంత్రులున్నా చేయలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో సీతారామ ప్రాజెక్టు కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేసి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తే, ప్రస్తుతం పనులపై తగిన శ్రద్ధ చూపడం లేదన్నారు. ఖమ్మం జర్నలిస్టుల కోసం మంజూరు చేసిన 23 ఎకరాల భూమిని ఇప్పటికీ జర్నలిస్టులకు కేటాయించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పడగాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, ఖమర్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బచ్చు విజయ్‌కుమార్, బత్తుల మురళి, కర్నాటి కృష్ణ, మగ్బూల్, పల్లా రోజ్‌లీనా, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పోరుబాటలో మాజీ మంత్రి పువ్వాడ


