70–90 శాతం రాయితీలు
ఎల్‌నినో వేళ ‘డ్రిప్’ ఉత్తమ మార్గం
నీరు, ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ
జిల్లాలోని 88వేల ఎకరాల్లో
బిందు సేద్యం
డ్రిప్, మల్చింగ్ అనుసరణీయం
ఖమ్మంవ్యవసాయం: చుక్క చుక్కే చెరువు అన్నట్లు... ఇప్పుడు నీటి చుక్కలు సిరులుగా మారుతున్నాయి. ఎల్‌నినో నేపథ్యాన వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేలా జిల్లాలోని పలువురు రైతులు బిందు సేద్యం అవలంబిస్తున్నారు. ఈ విధానంలో నీరు, ఖర్చు, ఎరువుల వినియోగం తగ్గడమే కాక దిగుబడి పెరగనుంది. ఇక మల్చింగ్ విధానంతో కూడిన డ్రిప్ పద్ధతి మరింత ప్రయోజనకరమని అధికారులు చెబుతున్నారు.
25వేల మందికి పైగా రైతులు
జిల్లాలో 25,641 మంది రైతులు 88,726 ఎకరాల్లో బిందు సేద్యం ద్వారా వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ఉద్యాన, కూరగాయల పంటలతో పాటు మొక్కజొన్న, మిర్చి కూడా ఉన్నాయి. ప్రధానంగా ఆయిల్ పామ్‌లో ఈ విధానాన్ని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యాన ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవడం కీలకంగా నిలుస్తుంది. ఈ మేరకు బిందు సేద్యం విధానాన్ని అవలంబిస్తే నీరు వృథా కాకుండా మొక్క వేరు వ్యవస్థ ఉన్న ప్రాంతానికి నేరుగా అందుతుంది. తద్వారా సంప్రదాయ విధానంతో పోలిస్తే 30–40 శాతం సాగునీరు ఆదా అవుతుంది.
● కొణిజర్ల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన రైతు జయరాజు బిందు సేద్యం, మల్చింగ్ విధానం అవలంబిస్తున్నారు. వంట తోట సాగు చేస్తుండగా ఎకరాకు సరిపోయే నీటిని బిందు సేద్యం విధానంలో రెండెకరాలకు వినియోగిస్తున్నారు. అంతేకాక మల్చింగ్ విధానంతో ఎకరాకు రూ. 20 వేల కూలీల ఖర్చు తగ్గిందని చెబుతున్నారు. ఎరువులను డ్రిప్ ద్వారా నేరుగా అందించడం వల్ల ఎకరాకు రూ. 10 వేల వరకు తగ్గిందని వెల్లడించారు. సాధారణ పద్ధతిలో ఎకరాకు 10 – 12 టన్నులు దిగుబడి వచ్చే వంగ బిందుసేద్యంతో 16 టన్నుల వరకు రానుందని చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా ఎకరాకు రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తే ఖర్చులు రూ. 50 వేలు పోగా రూ.1.50 లక్షల నికర ఆదాయం వస్తుందని వెల్లడించారు.
● మిరప సాగులో బిందు సేద్యం, మల్చింగ్ పద్ధతి ఉత్తమ మార్గంగా నిలుస్తుంది. మూడెకరాల్లో మిర్చి సాగు చేస్తే ఎకరాకు రూ. 1.20 లక్షల చొప్పున పెట్టుబడి అవుతుంది. మల్చింగ్‌తో కూలీల ఖర్చు ఎకరాకు రూ. 30 వేలు ఆదా కానుండగా, డ్రిప్ ద్వారా ఎరువులు ఇస్తే రూ.15 వేల వరకు ఖర్చు తగ్గుతుంది. సాధారణంగా కలుపుతో నల్ల తామర ఆశించి 15 – 18 క్వింటాళ్లు వచ్చే దిగుబడి.. బిందు సేద్యం విధానంలో 28 క్వింటాళ్లకు చేరుతుంది. ఫలితంగాఖర్చులు పోగా ఎకరాకు రూ 2.50 లక్షల ఆదాయం వచ్చే అవకాశముంది. దీంతో ఈసారి మిరప రైతులు పలువురు బిందు సేద్యం, మల్చింగ్ ఎంచుకుంటున్నారు.
● ఆధునిక విధానాలతో అధిక లాభాలు సాధించొచ్చని కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన గూడ నాగేశ్వరరావు నిరూపిస్తున్నారు. ఈయన రెండెకరాల్లో డ్రిప్, మల్చింగ్, ట్రెల్లిస్ పద్దతిలో టమాటా సాగు చేస్తున్నారు. నాలుగు నెలల పంట ఎకరాకు రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మల్చింగ్ విధానంతో కూలీల ఖర్చు ఎకరాకు రూ. 20 వేల వరకు తగ్గగా.. డ్రిప్ ద్వారా నేరుగా ఎరువులు అందించడం ద్వారా ఎకరాకు మరో రూ.10 వేలు తగ్గింది. ఎకరాకు 18 టన్నుల వరకు దిగుబడి రాగా, ప్రస్తుత ధరల ప్రకారం రూ.2.50 లక్షల వరకు ఆదాయం వస్తే ఖర్చులు పోగా ఎకరాకు 1.80 లక్షల ఆదాయం నమోదు కానుంది.
ప్రభుత్వం బిందు సేద్యాన్ని రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ఈ విధానం అమలుకు హెక్టార్‌కు పంట ఆధారంగా రూ.45 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే, ప్రభుత్వం బిందు సేద్య పరికరాలను 70–90 శాతం రాయితీలపై అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ రైతులకు 80 శాతం, జనరల్ రైతులకు 70 శాతం రాయితీ అమలవుతోంది.
ప్రస్తుతం నీటి వనరులు పరిమితంగా ఉన్నందున పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. డ్రిప్ విధానం అవలంబిస్తే నేరుగా మొక్క వేర్ల ప్రాంతానికి నీరు అందించొచ్చు. డ్రిప్‌తో పాటు మల్చింగ్ విధానంతో తేమ ఆధారంగా నీటి పారుదల చేపడితే మంచిది. తద్వారా ఉన్న నీటితోనే ఉత్తమ దిగుబడి సాధించొచ్చు.
– ఆకుల వేణు, ఉద్యానాధికారి, వైరా డివిజన్


