● మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతోనే బీహార్ వాసి హత్య ● వివరాలు వెల్లడించిన వైరా ఏసీపీ సారంగపాణి
మధిర: మధిరలోని ఆత్కూరు రోడ్డులోని ఈనెల 11న బీహార్ వాసి మృతదేహం వెలుగుచూడగా దర్యాప్తులో పోలీసులు ఆయనదిగా హత్యగా నిర్ధారించారు. ఈమేరకు వివరాలను వైరా ఏసీపీ సారంగపాణి శనివారం మధిర టౌన్ పోలీసుస్టేషన్‌లో వెల్లడించారు.
సాక్ష్యాలు తారుమారు
బీహార్‌కు చెందిన మహ్మద్ తాలిమ్ ఖమ్మంలో టైలర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10వ తేదీన ఆయన వ్యక్తిగత పనిపై మధిరకు రాగా, రాత్రి పట్టణ శివారు కాసర్ల వెంకటేశ్వరరావు బ్రిక్స్ కంపెనీ మీదుగా నడిచివెళ్తున్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న తాలిమ్ బ్రిక్స్ కంపెనీలో పనిచేసే ఎర్రుపాలెం మండలం గట్ల గౌరవరం గ్రామానికి చెందిన గుంజి రాములమ్మతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పక్కనే ఉన్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొమెరకు చెందిన గద్దల జమలయ్య కర్రతో పలుమార్లు బలంగా కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని బ్రిక్స్ కంపెనీ యజమాని కాకర్ల వెంకటేశ్వరరావు, ఆయన అల్లుడు పేరయ్యకు చెప్పడంతో కర్ర, ఫోన్లు దాచిపెట్టడమే కాక కాల్ హిస్టరీ డీలిట్ చేసి ఎటైనా వెళ్లిపోవాలని సలహా ఇచ్చారు. దీంతో నిందితులు కర్ర, మృతుడి సెల్ ఫోన్, రక్తపు మరకలు అంటిన దుస్తులను జిలుగుమాడులోని ఓ ఇంట్లో దాచి పెట్టి పారిపోయారు. ఘటనపై అందిన ఫిర్యాదుతో మధిర టౌన్ సీఐ రమేష్ ఆధ్వర్యాన విచారిస్తుండగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జమలయ్య, రాములమ్మను నిందితులుగా గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. అలాగే, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు వెంకటేశ్వరరావు, పేరయ్యను కూడా నిందితులుగా చేర్చినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ దోమల రమేష్, ఎస్‌ఐ నవిత పాల్గొన్నారు.


