● వచ్చే నెల 16వ తేదీ వరకు ప్రక్రియ ● సెప్టెంబర్ 17నుంచి ‘నో మ్యాపింగ్’ ఓటర్లకు పిలుపు
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా అనామలీస్ ఓటర్ల జాబితాపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. గత మంగళవారం మొదలైన విచారణ సెప్టెంబర్ 16వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. ఖమ్మం నియోజకవర్గంలోని 355 బూత్‌ల పరిధిలో అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలో 63 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈనేపథ్యాన అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు రెండు విడతలుగా నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని నిర్ణయించారు.
తొలుత అనామలీస్..
గత రెండు రోజులుగా అనామలీస్ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈమేరకు శనివారం నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు రోజుకు ఒక్కో బూత్ పరిధిలో 20 మందిని విచారించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఖమ్మం నియోజకవర్గంలో శనివారం 3,815 మందికి సమాచారం ఇవ్వగా, బూత్‌ల పరిధిలో అధికారులు ధ్రువీకరణ పత్రాల ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ఇక రెండో విడతగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి మ్యాపింగ్ జాబితాలో ఉన్న సుమారు 20వేల మంది ఓటర్లకు వచ్చే నెల 5వ తేదీ నుంచి నోటీసులు జారీ చేయనున్నారు.
భారీ సంఖ్యలో సవరణలు
ఖమ్మం నగర పరిధిలో ఓటర్ల జాబితా సవరణ సవాల్‌గా మారనుంది. నగరంలో ప్రస్తుతం 43 వేలకు పైగా ఓటర్లు అనామలీస్ జాబితాలో ఉండగా, మరో 20 వేల మంది ఓటర్లు నో మ్యాపింగ్ జాబితాలో ఉన్నారు. వయస్సులో తేడా, పేర్లలో తప్పులు, కుటుంబ సభ్యుల మధ్య వయస్సు వ్యత్యాసాలను అనామలీస్ జాబితాలో చేర్చారు. 2011 జాబితాలో పేర్లు లేని, కుటుంబ సభ్యుల వివరాలు లేని వారిని నో మ్యాపింగ్ కింద చేర్చారు. నోటీసు అందుకున్న వారు విచారణకు హాజరై అధికారుల సూచించిన సమాచారం ఇవ్వడమే కాక సరైన గుర్తింపు పత్రాలు సమర్పిస్తే తుది ఓటరు జాబితాలో స్థానం దక్కనుంది. కాగా, జాబితాలో పేర్లు ఉన్న ఓటర్లకు ముందస్తుగా నోటీసులు జారీ చేయనుండగా, విచారణకు హాజరయ్యే సమయాన పుట్టిన తేదీ, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, పాత ఓటరు వివరాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, కేఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


