డివిజన్ల వారీగా ఇష్టారాజ్యంగా
వార్డెన్ల వ్యవహారం
ఫలితంగా విద్యార్థులకు అందని
పౌష్టికాహారం
ప్రశ్నిస్తే బెదిరింపులు?
ఆకస్మిక తనిఖీలు చేస్తాం..
ఖమ్మంమయూరిసెంటర్: గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా మెనూ అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం, ఉన్నతాధికారులు చెబుతుంటారు. అంతేకాక ఏరోజు ఏం వడ్డించాలో ముద్రించి హాస్టల్ గోడలపై బోర్డులు తగిలిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపంతో అవేమీ అమలుకావడం లేదు. మెనూ ప్రకారం రోజుకో టిఫిన్ అందించాలని ఉన్నా నిత్యం ఒకే రకమైన ఆహారం వడ్డిస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఓచోట కిచిడీ, ఇంకోచోట పులిహోర
ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో టిఫిన్‌గా విద్యార్థులకు బోండా, చట్నీ అందించాల్సి ఉంది. కానీ ఖమ్మంలోని పలు హాస్టళ్లను పరిశీలిస్తే ఎక్కడా బోండా కానరాలేదు. ఒక హాస్టల్‌లో కిచిడీ, రసం వండితే.. మరోచోట పులిహోర, ఇంకో చోట జీరా రైస్, గోధుమ రవ్వ ఉప్మా ఇలా వార్డెన్లకు తోచినట్లు చేయించారని తేలింది. మెనూలో పోషకాలు ఉండే ఆహారానికి బదులు సులువుగా తయారయ్యేలా బియ్యంతో చేసే టిఫిన్ వడ్డిస్తున్నట్లు విద్యార్థుల ద్వారా తెలిసింది.
గుడ్లు, చికెన్ పంపిణీ అంతంతే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారానికి ఐదు కోడిగుడ్లు, ఆరు అరటిపండ్లు, రెండుసార్లు చికెన్, శనివారం ప్రత్యేక స్వీటే కాక ప్రతిరోజూ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి. కానీ ఇవేమీ అమలుకాకపోగా.. రికార్డుల ప్రకారం హాజరు, వంటకాల్లో ఉపయోగిస్తున్న చికెన్, ఇతర నిత్యావసర సరుకుల పరిమాణానికి పొంతన ఉండడం లేదు. కొనుగోలు బిల్లులు, వినియోగానికి మధ్య కొండంత వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఖమ్మంలోని ఓ గిరిజన హాస్టల్‌లో గురువారం ఉదయం మూడు కేజీల గోధుమ రవ్వతో ఉప్మా చేయించారు. ఎందరి కోసమని ఆరా తీస్తే 50 మందికి అని వర్కర్లు చెప్పారు. ఇక ఒకటి, రెండుచోట్ల తప్ప ఎక్కడా వార్డెన్లు కనిపించకపోవడం గమనార్హం.
డివిజన్లలోనూ వేర్వేరుగా...
జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లన్నింటికీ ఒకే రకమైన బడ్జెట్ ఉంటుంది. అయితే, వైరా డివిజన్ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సాధ్యమైనంత మేర అమలువుతుంటే.. ఖమ్మం డివి జన్‌లోని గిరిజన కళాశాల వసతిగృహాల్లోనే మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉంటున్నాయి. అధికారుల తనిఖీల సమయాన రికార్డులే పరిశీలిస్తూ మెనూ, విద్యార్థుల హాజరును పట్టించుకోవడం తెలుస్తోంది. ఇకనైనా పేద గిరిజన విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
గిరిజన హాస్టళ్లలో అమలు కాని ఒకే తరహా మెనూ
మెనూ ఆదారంగా తమకు టిఫిన్, భోజనంలో కూరలు వడ్డించలేదని ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే వారిపై వార్డెన్లు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది. సీనియర్ విద్యార్థుల ద్వారా భయపెట్టడం, అడ్మిషన్ రద్దు చేస్తామని బెదిరిస్తుండడంతో విద్యార్థులు చేసేదేం లేక వడ్డించిందే తిని ఊరుకుంటున్నారు.
సత్తుపల్లిలోని వసతిగృహాల పరిశీలనలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించినట్లు తేలింది. ఖమ్మం డివిజన్‌లోనూ ఆకస్మిక తనిఖీలు చేస్తాం. మెనూ పరిశీలనకు ప్రత్యేక యాప్ వచ్చింది. ఇక నుంచి వార్డెన్లు విద్యార్థులకు వడ్డించిన భోజనం ఫొటోలను అందులో అప్‌లోడ్ చేయాలి. మెనూ అమలుపై ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – ఎం.ఫిరంగి,
డిప్యూటీ డైరెక్టర్, గిరిజన అభివృద్ధి శాఖ


