బోధన పరిశీలన.. విద్యార్థుల ప్రగతిపై ఆరా | - | Sakshi
Sakshi News home page

బోధన పరిశీలన.. విద్యార్థుల ప్రగతిపై ఆరా

Aug 14 2026 7:38 AM | Updated on Aug 14 2026 7:38 AM

నేలకొండపల్లి: గురుకులంలో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించిన ట్రెయినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పరాస్‌కుమార్‌.. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతూ వారి ప్రగతిని పరీక్షించారు. నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల పరి శీలన అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనపై సూచనలు చేశారు. అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మారి పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టా రు. అలాగే, వంట గదులు, డైనింగ్‌ హాల్‌ను పరిశీలించి మెనూ అమలుపై ఆరా తీశారు. ఆతర్వాత పరాస్‌కుమార్‌ నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రాన్ని సందర్శించడమే కాక భక్తరామదాసు ధ్యాన మందిరంలో పూజలు చేశారు.

నాణ్యమైన నారే పెంచాలి

చింతకాని: నర్సరీల యజమానులు ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలకు చెందిన నాణ్యమైన మిర్చి విత్తనాలతోనే నారు పెంచాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్‌ సూచించారు. చింతకాని మండలం జగన్నాథపురంలోని నర్సరీలను గురువారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలతో నారు పెంచి రైతులకు సరఫరా చేయాలని, అంతేకాక ప్రతీ రైతుకు పూర్తివివరాలతో కూడిన రశీదు ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా, ఎల్‌నినో నేపథ్యాన రైతులు అధిక నీరు అవసరమయ్యే మిర్చి, వరి సాగు విషయంలో అప్రమత్తంగా వ్యవరించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిర్చి సాగు తగ్గించి ఉద్యాన పంటలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మధిర డివిజన్‌ ఉద్యాన అధికారి ఏ.విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

రైస్‌మిల్లులో

విజిలెన్స్‌ తనిఖీలు

సత్తుపల్లి టౌన్‌: జిల్లాలోని రైస్‌మిల్లుల్లో విజిలెన్స్‌ తనిఖీల పరంపర కొనసాగుతోంది. నేలకొండపల్లి, పెనుబల్లి, తల్లాడ, ముదిగొండ మండలాల్లోని మిల్లుల్లో చేపట్టిన తనిఖీల్లో అక్రమాలు బయటపడిన విషయం విదితమే. ఈమేరకు సత్తుపల్లి మండలం తాళ్లమడలోని పీవీఆర్‌ రైస్‌ మిల్లులో గురువారం వరంగల్‌ నుంచి వచ్చిన విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్‌ తహసీల్దార్‌ లక్ష్మణ్‌, ఇన్‌స్పెక్టర్‌ జి.రాకేష్‌ నేతృత్వాన సిబ్బంది మిల్లులోని సీఎంఆర్‌ ధాన్యం వివరాలు సేకరించి రికార్డుల ఆధారంగా స్టాక్‌ ఉందా, లేదా అని పరిశీలించారు. అయితే, తనిఖీలకు సంబంధించి వివరాలను అధికారులు వెల్లడించలేదు.

ఎన్పీడీసీఎల్‌ టోర్నీలో విజేతగా ఉమ్మడి ఖమ్మం

ఖమ్మంవ్యవసాయం: నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎన్పీడీసీఎల్‌) స్థాయిలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విజేతగా నిలిచింది. ఇటీవల వరంగల్‌లో జరిగిన టోర్నీలో ఉమ్మడి జిల్లా ఉద్యోగులతో కూడిన జట్టు విజేతగా నిలవగా గురువారం ఉన్నతాధికారులు కప్‌ అందజేసి అభినందించారు. ఈమేరకు జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన బి.రామకృష్ణారావు(ఖమ్మం)తో పాటు సభ్యులైన పి.సతీష్‌(రఘునాథపాలెం), ఎండీ.అబ్దుల్‌ ఆసిఫ్‌(తల్లాడ), కె.చరణ్‌రాజ్‌(ఖమ్మం టౌన్‌), ఎం. వివేక్‌కుమార్‌(ఖమ్మం), వి.అశోక్‌(మణుగూరు), ఎన్‌.షణ్ముఖాచారి(పల్లెగూడెం), జి.కృష్ణ(అశ్వాపురం), ఎం.రవితేజ(కొత్తగూడెం), కె.జాషువా(భద్రాచలం), ఎం.డి.ఆరిఫ్‌(జూలూరుపాడు), ఎం.శ్యాంకుమార్‌(కూసుమంచి), బి.రాంబాబు(జూలూరుపాడు), ఎండీ.రసూల్‌ఖాన్‌(కొత్తగూడెం)ను ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, అధికారులు అభినందించారు.

లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేస్తే చర్యలు

ఏన్కూరు: లైసెన్స్‌ లేకుండా పంటల క్రయవిక్రయాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌ శాఖ రీజియన్‌ డీడీ పద్మావతి వెల్లడించారు. ఏన్కూరు మార్కెట్‌ కార్యాలయానికి గురువారం వచ్చిన ఆమె ఉద్యోగులతో సమావేశమై పన్నుల వసూళ్లపై సమీక్షించి సూచనలు చేశారు. అనంతరం డీడీ మాట్లాడుతూ అవకతవకలకు పాల్పడిన కోల్డ్‌స్టోరేజీలు, జిన్నింగ్‌ మిల్లుల బాధ్యులు చర్యలు తప్పవని చెప్పారు. ఈమేరకు వైరా, మధిర, ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట తదితర ప్రదేశాల్లో కోల్డ్‌స్టోరేజీలను పరిశీలించినట్లు తెలిపారు. మార్కెట్‌ కార్యదర్శి నిర్మల, సూపర్‌వైజర్లు అనూష, రామారావు, హుస్సేన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement