● అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి ● మూడు రోజుల క్రితమే చెల్లెలి సీమంతం
సత్తుపల్లి: అన్నాచెల్లెలు ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. చెల్లెలి వివాహం జరగగా, ఆమె ప్రస్తుతం గర్భవతి, దీంతో బిడ్డకు తోడు ఉండేందుకు తల్లి కూడా అమెరికాకు వెళ్లింది. అక్కడ తల్లితో కలిసి చెల్లెలికి సీమంతం జరిపించి సంతోషంగా గడిపిన సోదరుడు నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన శాంతినికేతన్ విద్యాసంస్థల బాధ్యుడు ములకలపాటి రవి – లీలావతి దంపతులకు కుమారుడు పార్థసారధి(32), కుమార్తె జాహ్నవి ఉన్నారు. వీరిద్దరు అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటున్నారు. పార్థసారధి ఉన్నత చదువుల నిమిత్తం పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆతర్వాత వెళ్లిన జాహ్నవి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త వైద్యుడిగా అక్కడే స్థిరపడ్డారు. గర్భవతి అయిన జాహ్నవికి తోడు ఉండేందుకు తల్లి లీలావతి నెల క్రితం అమెరికా వెళ్లింది. జాహ్నవి సీమంతం మూడు రోజుల క్రితం నిర్వహించగా, బుధవారం రాత్రి వరకు కుటుంబంతో ఆనందంగా గడిపాక పార్థసారధి తన గదికి వెళ్లాడు. గురువారం నిద్ర లేపేందుకు ప్రయత్నించగా చలనం లేకపోవడంతో నిద్రలోనే గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని నిర్ధారించారు. ‘చెల్లెలి సీమంతం రోజు పార్థసారధి ఫోన్ చేసి నన్ను కూడా అమెరికాకు రమ్మని చెప్పాడు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకుని స్థిరపడతానని చెప్పాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది’ అని తండ్రి రవి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈమేరకు పార్థసారధి చివరి చూపు కోసం రవి గురువారం రాత్రి అమెరికా బయలుదేరగా, అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, పార్థసారధి మృతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తదితరులు సంతాపం తెలిపారు. ఆయనను కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్, సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.డీ.రెహానా బేగం, కమల్ పాషా, బొంతు సుమలత, దోమ ఆనంద్ తదితరులు పరామర్శించారు.


