మిల్క్ బ్యాంక్ సేవలు ఇలా..
● జనరల్ ఆస్పత్రిలో మిల్క్ బ్యాంక్‌కు నాలుగేళ్లు ● స్వచ్ఛందంగా పాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న తల్లులు ● వేలాది మంది నవజాత శిశువులకు మేలు
ఖమ్మంవైద్యవిభాగం: తల్లి పాలు శిశువుకు అమృతం వంటివి. బిడ్డ పుట్టిన గంట లోపు ముర్రుపాలు పట్టిస్తే ఆ శిశువు ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరడమే కాక ఎదుగుదలకు ఉపయోగపడుతాయి. అయితే, కొందరు తల్లులకు సరిపడా పాలు రాక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరికొందరు తల్లులకు పాలు లభించినా శిశువుకు పట్టలేని పరిస్థితి ఎదురవుతోంది. ఫలితంగా ఆయా శిశువులకు డబ్బా పాలు పట్టిస్తే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో 2022 మే నెలలో ‘అమృతం’ పేరిట తల్లిపాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాలు ఎక్కువగా వచ్చే తల్లుల నుంచి సేకరించి భద్రపరుస్తూ పాలు రాని తల్లుల పిల్లలకు అందిస్తున్నారు. అలాగే పాలు వచ్చినా పట్టించలేని తల్లులు కూడా ఈ కేంద్రంలో పాలను డబ్బాల్లో సేకరించి శిశువులకు పట్టించే అవకాశం కల్పిస్తున్నారు.
నాలుగేళ్లుగా సేవలు
పెద్దాస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల సేకరణ కేంద్రం నాలుగేళ్లుగా విస్తృత సేవలు అందిస్తోంది. నిత్యం 20 – 25 వరకు ప్రసవాలు జరుగుతుండగా, బరువు తక్కువగా, ఇతర అనారోగ్య సమస్యలతో పుట్టిన వారికి ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అందిస్తారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో జన్మించి అనారోగ్య సమస్యలకు గురైన శిశువులను కూడా ఎంసీహెచ్‌ఎస్‌కు తీసుకొస్తున్నారు. వీరిలో చాలామంది శిశువులకు తల్లి నేరుగా పాలు పట్టించడం సాధ్యం కాక డబ్బా పాలపై ఆధారపడుతున్నారు. ఈ క్రమాన మిల్క్ బ్యాంక్‌లో పాలు ఎక్కువ పడే తల్లులు స్వచ్ఛందంగా ముందుకొస్తుండగా సేకరించి అవసరమైన శిశువులకు అందిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఈ కేంద్రం ద్వారా 10,861 మంది తల్లుల నుంచి 2,969 లీటర్ల పాలు సేకరించి శిశువులకు అందించారు. పెద్దాస్పత్రిలో చికిత్స పొందే శిశువులకే కాక శిశుగృహలో ఉండే పిల్లలకు 159 లీటర్ల పాలు సరఫరా చేయడం విశేషం.
పాలు అందించిన తల్లులు 10,681 మంది
స్వచ్ఛందంగా వచ్చిన వారు 5,299 మంది
ఇప్పటి వరకు సేకరించిన పాలు 2,969 లీటర్లు
లబ్ధి పొందిన శిశువులు 12,494 మంది


