కేఎంసీలో ‘అవినీతి’ కలకలం | - | Sakshi
Sakshi News home page

కేఎంసీలో ‘అవినీతి’ కలకలం

Aug 7 2026 12:20 AM | Updated on Aug 7 2026 12:20 AM

● ఇటీవలే బయటపడిన డీజిల్‌ దోపిడీ ● ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వసూళ్లు ● వరుస ఘటనలతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం?

విచారణ ప్రారంభం

● ఇటీవలే బయటపడిన డీజిల్‌ దోపిడీ ● ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వసూళ్లు ● వరుస ఘటనలతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం?

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం నగర పాలక సంస్థ (కేఎంసీ) అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిందనే ఆరోపణలు నానాటికీ పెరుగుతున్నాయి. అధికారిక కూపన్లతో సంబంధం లేకుండా.. కేవలం ఫోన్‌ కాల్‌తో వాహనాల్లో వందల లీటర్ల డీజిల్‌ కొట్టించే దందాపై విమర్శలు వస్తుండగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల నుంచి వసూళ్లు బయటపడ్డాయి. ఒకదాని వెనుక ఒకటి అవినీతి ఆరోణలు వస్తుండడం చర్చకు దారి తీయగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు కేఎంసీపై కన్నేసినట్లు తెలిసింది.

సోషల్‌ మీడియాలో..

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం కొందరు సిబ్బంది లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే కాక లంచాలు డిమాండ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ఆడియోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. తొలుత ఆడియోలు బయటకు రాగా.. మరుసటి రోజే లంచం తీసుకుంటున్న వీడియోలు రావడం అధికార యంత్రాంగాన్ని షాక్‌కు గురిచేసింది. నిబంధనలకు విరుద్ధంగా, రికార్డులు లేకుండా డీజిల్‌ పక్కదారి పట్టిస్తారనే విమర్శలు వచ్చిన కొన్నాళ్లకు ఇందిరమ్మ పథకంలో అవినీతి బయటపడడం గమనార్హం. డీజిల్‌ పక్కదారి పట్టించిన ఘటనలో కొందరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు.. ఆ తర్వాత ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడంపై అనుమానాలను వ్యక్తయమవుతున్నాయి.

పాలకులు, అధికారుల అండదండలు?

అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత, మంత్రి అనుచరుల అండదండలతోనే దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అధికారులకు విషయం తెలిసినా రాజకీయ ఒత్తిళ్ల వల్ల మౌనం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, కొందరు సిబ్బందితో ఉన్న లోపాయికారీ ఒప్పందాలతో పాలనపై పట్టు సడలిపోయిందని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి తెరతీయడం, ప్రభుత్వంపై బురదజల్లేలా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులు, మంత్రి క్యాంప్‌ కార్యాలయ ప్రతినిధులు రంగంలోకి దిగినట్లు సమాచారం. కేఎంసీలో జరుగుతున్న అంశాలపై వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఆడియో, వీడియో ఆధారాల లీకేజీల వెనుక ఎవరున్నారు, డీజిల్‌ దోపిడీ వెనుక ఎవరి హస్తం ఉందనే అంశంపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

ప్రక్షాళన దిశగా చర్యలు..

కేఎంసీ ప్రతిష్ట దిగజారిన నేపథ్యాన, త్వరగా చక్కదిద్ది, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అటు అధికారులు, ఇటు పాలకులు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. కేఎంసీ పాలనను వెంటనే గాడిన పెట్టకుంటే భవిష్యత్‌లో ఆరోపణలు పెరుగుతాయనే భావనతో యంత్రాంగం, పాలకులు ముందుడుగు వేసినట్లు సమాచారం.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల నుండి ఓ వార్డ్‌ ఆఫీసర్‌ నగదు డిమాండ్‌ చేశారని ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుతో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇప్పటికే సదరు వార్డ్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేయగా.. విచారణ కోసం త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు గురువారం విచారణకు హాజరుకావాలని సూచించగా ఉద్యోగి వచ్చినా ఫిర్యాదుదారుడు రాలేదని తెలిసింది. దీంతో శుక్రవారం రావాలని మరోసారి నోటీసు పంపినట్లు సమాచారం. అయితే, కలెక్టరేట్‌లోని ఉద్యానశాఖ కార్యాలయంలో చేపట్టిన విచారణలో సదరు ఉద్యోగి మాత్రం తానెలాంటి తప్పు చేయలేదని, కావాలనే ఇరికిస్తున్నారని చెప్పినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement