ఖమ్మంక్రైం: బంగారు గొలుసు చోరీకి పాల్పడిన నిందితుడిని ఖమ్మం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలు.. సహకారనగర్‌కు చెందిన పూటగోకర్ల రమాదేవి కిరాణం సరుకులు తీసుకుని వెళ్తుండగా కొణిజర్ల మండలం గోపవరానికి చెందిన బంటు రాము ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. ఆ తర్వాత గొలుసును గాంధీచౌక్‌లో బంగారం దుకాణంలో విక్రయించాడు. గురువారం వాహనాల తనిఖీ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన రామును అదుపులోకి విచారించగా చోరీ విషయం బయటపడింది. ఆయన నుంచి బైక్, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. కాగా, జల్సాలకు అలవాటు పడిన రాము చోరీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు.
బాలికను పెళ్లాడిన వ్యక్తిపై పోక్సో కేసు
తిరుమలాయపాలెం: దంపతుల నడుమ గొడవలతో భార్య కుమారులతో కలిసి వేరే ఉంటుండగా, ఆమె భర్త 17 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వంగా సతీశ్ గత నెల 20న బాలికను వివాహం చేసుకుని ఇంట్లోనే జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారి లక్ష్మి ఫిర్యాదు మేరకు కూసుమంచి సీఐ సంజీవ్ గురువారం విచారణ చేపట్టి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
696.1 కిలోల
గంజాయి దగ్ధం
తల్లాడ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన గంజాయిని తల్లాడ మండలం గోపాలపేట ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ (వ్యర్థ పదార్థాల నివారణ పరిశ్రమ)లో దహనం చేశారు. భద్రాద్రి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 32 కేసులకు సంబంధించి 696.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.50 కోట్లు కాగా, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి ఆదేశాలతో గురువారం దహనం చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, కొత్తగూడెం డీపీఈఓ ఎ.శ్రీనివాసరెడ్డి, సీఐ జయశ్రీ, ఎస్‌ఐలు రమేశ్, గౌతమ్ పాల్గొన్నారు.


