చింతకాని: చింతకాని రైల్వేస్టేషన్ సమీపాన గుర్తుతెలియని వృద్ధుడు(70) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు... సదరు వృద్ధుడు గురువారం ఉదయం విజయవాడ వైపు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడడంతో వృద్ధుడి శరీరం నుజ్జునుజ్జయి గుర్తు పట్టలేని విధంగా మారింది. ఆయన వద్ద చేతికర్ర ఉండగా, గోధుమ, గులాబీ రంగులతో ఉన్న కండువా, మెరూన్, నలుపు, తెల్లటి చుక్కలతో ఉన్న లుంగీ లభించాయని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ఆస్పత్రి మార్చురీకి తరలించగా, ఆయన వివరాలు తెలిసిన వివరాలు 98481 14202, 87125 58589 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
అనారోగ్యంతో డిప్యూటీ జైలర్ మృతి
సత్తుపల్లి టౌన్: సత్తుపల్లి సబ్‌జైలులో డిప్యూటీ జైలర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు(56) మృతి చెందారు. ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఆయన కడప, హైదరాబాద్, ఖమ్మం, సత్తుపల్లి సబ్ జైళ్లలో పనిచేశారు. కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసరావు గురువారం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా, శ్రీనివాసరావు మృతిపై సబ్ జైల్ సూపరింటెండెంట్ ఉబ్బల కుటుంబరాజు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు
ఖమ్మంలీగల్: అప్పు చెల్లించే క్రమాన జారీ చేసిన చెక్కు చెల్లకపోవడంతో నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన నందిగామ ఆనంద్‌బాబుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బెక్కం రజిని గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం శ్రీనగర్‌కాలనీకి చెందిన బండి శివరంజని వద్ద ఆనంద్ 2022 జనవరిలో రూ.6 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2023 జనవరిలో రూ.7 లక్షలకు చెక్కు జారీ చేసిన ఆయన ఖాతా అప్పటికే మూసివేయడంతో తిరస్కరణకు గురైంది. దీంతో న్యాయవాది ద్వారా శివరజంని లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈ మేరకు విచారణ అనంతరం ఆనంద్‌కు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.8 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.


