ఉమ్మడి జిల్లాకు పలుమార్లు వచ్చిన మధుర గాయని ఎస్.జానకి
30 ఏళ్ల క్రితం గాంధీచౌక్
శ్రీరామనవమి వేడుకలకు హాజరు
భద్రాచలంలోనూ పలు ఉత్సవాల్లో పాల్గొన్న గానకోకిల
జానకమ్మ పాటలు చిరస్మరణీయం
ఒక యుగం ముగిసింది..
మన
నేలపై..
శ్రీరామ రామ రామేతి..
ఖమ్మం గాంధీచౌక్‌లో 1996 ఏప్రిల్‌లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు నిర్వాహకుల ఆహ్వానం మేరకు జానకమ్మ హాజరయ్యారు. భక్త రామదాసు ప్రాజెక్టు బాధ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని తన మధుర గానంతో జిల్లావాసులను రంజింపజేశారు. సుమారు రెండు గంటల పాటు భక్తి గీతాలతో పాటు అలనాటి మధుర గీతాలను జానకమ్మ ఆలపించారని స్థానికులు గురు ్తచేసుకుంటున్నారు. శ్రీరామ రామ రామేతి, ఎంత మాత్రమున ఎవరెరుగగలరు, పాలయమామ్ వంటి భక్తిగీతాలే కాక తెలుగు సినీ పాటలతో మంత్రముగ్ధులను చేశారని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం, సంగీత ప్రియులు హాజరుకావడంతో కూర్చునేందుకు కూడా స్థలం దొరకలేదని పలువురు తెలిపారు. ఖమ్మం ప్రజలకు జానకమ్మ గాత్రం మధుర జ్ఞాపకంగా ఉండిపోతుందని శ్రీరామనవమి వేడుకల నిర్వాహకులు, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. ‘జానకమ్మ వేదిక ఎక్కగానే గాంధీచౌక్ మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఆమె పాడిన కొన్ని పాటలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించాయి’ అని ఆ కార్యక్రమానికి హాజరైన పలువురు తెలిపారు. ఇక ఖమ్మంకు సుధా సౌండ్ సిస్టం నిర్వాహకులతో ఉన్న పరిచయంతో వారి ఇంటికి వెళ్లిన జానకమ్మ కుటుంబ సభ్యులతో ఫొటో దిగారు. అంతేగాక ఆమెకు శ్రీకృష్ణ మందిరం ఫొటో జ్ఞాపికగా అందించామని వారు తెలిపారు.
భద్రాచలానికి కూడా..
సుమధుర గాయని జానకమ్మ రాముడు నడయాడిననట్లు విశ్వసిస్తున్న భద్రాచలానికి సైతం పలుమార్లు వచ్చారు. ప్రభుత్వం ముప్ఫై ఏళ్ల క్రితం నిర్వహించిన భద్రాద్రి ఉత్సవాలకు ఆమె ఓసారి హాజరై రామయ్యను కూడా దర్శించుకున్నారు. భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన పలువురు ఆమె పాడిన పాటలను జ్ఞాపకం చేసుకున్నారు. మరోమారు ఉత్సవాలకు వచ్చినప్పుడు తొలుత తమ ఇంట జానకమ్మ కాసేపు సేద తీరారని రామాలయ ప్రస్తుత ప్రధాన అర్చకుడు కోటి రామస్వరూప్ గుర్తుచేసుకున్నారు. అప్పుడే రామయ్యకు ఆమె వెండి కిరీటం సమర్పించారు. జానకమ్మకు రామయ్య అంటే అపారమైన భక్తి అని.. ఆ కారణంగానే ఉత్సవాలకు హాజరై రామయ్య కీర్తనలు ఆలపించారని రామస్వరూప్ తెలిపారు. అదే సమయాన పర్ణశాలను కూడా దర్శించుకున్నారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
సుప్రసిద్ధ గాయని ఎస్.జానకికి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో అనుబంధం ఉంది. ఆమె శనివారం గుండెపోటుతో కన్నుమూసినట్లు తెలియగానే సంగీత ప్రియులు, జిల్లావాసులు ఆమెతో
జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. ఖమ్మంలో జానకమ్మ పాడిన రామభజనలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతున్నాయని తెలిపారు. జానకమ్మ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అని గాయనీ, గాయకులు పేర్కొన్నారు. – ఖమ్మంగాంధీచౌక్/భద్రాచలం
గానకోకిల జానకమ్మ పాటలు మరువలేనివి. ఆమె గాత్రమే పాటలను మధురంగా మారుస్తుంది. చిన్న పిల్లలు మొదలు, పెద్దలు, వృద్ధుల వరకు ఆడ, మగ గాత్రాలను పాడగలడం ఆమె గొప్పతనం. ఆమె పాటలు పాడుతూనే చిరునవ్వులు చిందించడం ఎంత సేపైనా చూడొచ్చు.
–శఠగోపం సుదర్శన్, సుధా సౌండ్ సిస్టం, ఖమ్మం
జానకమ్మ గొంతులో ఉండే భావం, నాలుగు భాషల్లో పలికించే ఉచ్ఛారణను మళ్లీ వినలేం. ఆమె లేకుండా తెలుగు పాట చరిత్ర అసంపూర్ణం. 88 ఏళ్ల వయసులో కూడా ఆమె పాడిన పాటలు, సంగీతంపై ఆమెకు ఆసక్తి మాలాంటి ఎందరికో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.
–ఎస్.వీ.రమణ, గాయకుడు, ఖమ్మం


