చెట్లు ఏపుగా పెరుగుతాయి
● మామిడి తోటల్లో కొమ్మల కత్తిరింపు కీలకం ● ఇదే అనువైన సమయం కావడంతో అధికారుల అవగాహన ● రైతులు ముందుకొస్తే మంచి ఫలితాలు
తల్లాడ: మామిడితోటల్లో కాయల సీజన్ ముగిసింది. ఈ సమయాన రైతులు సస్యరక్షణ చర్యలపై దృష్టి సారించారు. ఈ మేరకు ముదురు తోటల్లో చెట్లకు భారంగా మారిన కొమ్మలను నరికివేయడం మొదలుపెట్టారు. ఇలా కొమ్మల తొలగింపుతో గాలి, వెలుతురు అన్ని కొమ్మలకు సమృద్ధిగా తాకుతుందని.. సీజన్‌లో పిందె రాలడం తగ్గుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే, దట్టంగా ఉన్న కొమ్మలను తీస్తే చెట్టు శక్తి అవస రమైన కొమ్మలతో పాటు పూత, పిందెకు ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. ఈ మేరకు రైతులు మామిడి తోటల్లో కొమ్మల కత్తిరింపు పనుల్లో నిమగ్నం కాగా.. రైతులంతా ముందుకొచ్చేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
చీడపీడలు తక్కువ
మామిడి చెట్లపై అన్ని కొమ్మలకు గాలి తాకకపోతే బూజు, ఆకుమచ్చ, పొడిబెట్ట వంటివి వస్తాయి. కత్తిరింపుతో చెట్టు మధ్యలో గాలి తిరిగి తేమ తగ్గుతుంది. పురుగు మందులు కొట్టడం కూడా సులువవుతుంది. అలాగే, కొమ్మల కత్తిరింపుతో చెట్లు ఎక్కువ ఎత్తు పెరగకుండా 3–4 మీటర్లలో ఉంచితే కాయలు కోయడం, మందు కొట్టడం తేలికవుతుంది. చిన్నప్పటి నుంచి కత్తిరిస్తే గుండ్రటి, బలమైన కాండం, సమానంగా విస్తరించిన కొమ్మలతో చెట్టు సరైన రూపం దాల్చి గాలి, తుపానుకు విరిగిపోయే అవకాశాలు తగ్గుతాయి.
ఇదే అదును..
పంట కోసిన వెంటనే.. జూన్ – జూలై నెలల్లో ఎండిన, చీడపీడలు ఉన్నవే కాక ఒకదానిపై ఒకటి రుద్దుకునే కొమ్మలను తొలగించాలి. కొత్త చిగుళ్లు వచ్చే ముందు కత్తిరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒకేసారి 20 – 25 శాతం కంటే ఎక్కువ కొమ్మలు మాత్రం తీయొద్దు. ఇక కత్తిరించిన చోట ‘బోర్డో’పేస్ట్ రాస్తే ఫంగస్ రాకుండా ఉంటుంది.
జిల్లాలో 32 వేల ఎకరాలు..
ఖమ్మం జిల్లాలో 32 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. కల్లూరు డివిజన్‌లో 20 వేల ఎకరాలు, ఖమ్మం డివిజన్‌లో 12 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. అయితే, మొత్తం తోటల్లో 50 శాతానికి పైగా ముదురు తోటలు ఉన్నట్లు అంచనా. బంగినపల్లి, పెద్ద రసాలు, చిన్న రసాలు, గులాబీ, తోతాపురి, హిమ పసంద్ వంటి రకాలకు చెందిన తోటల్లో ఏటా డిసెంబర్‌లో పూత ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సీజన్ ముగిసినందున కొమ్మల తొలగింపు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
మామిడితోటల్లో కొమ్మల కత్తిరింపు వల్ల చెట్లు ఏపుగా పెరుగుతాయి. దిగుబడి కూడా పెరుగుతుంది. లేత తోటల్లో ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ము దురు తోటల్లోనైతే పూత నిలవడం, కాయ దిగుబడి పెరగడానికి ఉపకరిస్తుంది. రైతులు జూలై నెలలో కొమ్మలు కత్తిరించడం వల్ల వర్షాలకు మళ్లీ చిగుర్లు వచ్చి కొత్త కొమ్మలు పెరుగుతాయి. –ఎండీ తాజుద్దీన్, ఏఓ, తల్లాడ


