ఖమ్మంసహకారనగర్: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో పలు సబ్జెక్ట్‌లను బోధించేందుకు గాను ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఇన్‌సర్వీస్ టీచర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ వాసంతి ఆదవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, గణితం, ఫిలాసఫీ, సోషయాలజీ, సైకాలజీ, సైన్స్, తెలుగు సబ్జెక్ట్‌లు బోధించే వారు అర్హులని, ఈ నెల 14వ తేదీ వరకు www. schooledu. telangana. gov. inవెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రశాంతంగా పరీక్ష
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని కేజీబీవీల్లో చదివే ఆరో తరగతి విద్యార్థులకు ఆదివారం జరిగిన యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (జేఈఈ, నీట్, సీఎల్‌ఏటీ)లలో శిక్షణ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ డి.వాసంతి తెలిపారు. పరీక్ష నిర్వహ ణ కోసం జిల్లాలో రెండు సెంటర్లు ఏర్పాటు చేయగా, జేఈఈ శిక్షణ కోసం 35 మంది దర ఖాస్తు చేసుకోగా, 14 మంది పరీక్ష రాశారని, నీట్ కోసం 75 మంది దరఖాస్తు చేసుకోగా, 52 మంది, సీఎల్‌ఏటీ కోసం 37 మంది దరఖాస్తు చేసుకోగా, 29 మంది పరీక్ష రాశారన్నారు. పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శంభుప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ (ఎగ్జామ్స్) మాధవరావు, జెండర్ కోఆర్డినేటర్ జానకీదేవి, పాల్వంచ ఎంఈఓ రాంమూర్తి, దుమ్ముగూడెం ఎంఈఓ సమ్మయ్య సహకరించారని డీఈఓ పేర్కొన్నారు.
మాలల ప్రయోజనాలే ముఖ్యం
భద్రాచలంటౌన్: ఎస్సీ వర్గీకరణ విషయంలో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే... తనకు పదవులేం ముఖ్యం కాదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, భూగర్భగనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మాలల హక్కుల సాధన, వారికి జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడతానని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ అమలు, రోస్టర్ విధానం రద్దు కోసం భద్రాచలంలో ఆదివారం నిర్వహించిన మహా ర్యాలీ, బహిరంగ సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే వర్గీకరణ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా... ఉమ్మడి రాష్ట్రంలోని దామాషా ప్రకారమే ఈ విభజన జరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం కొన్ని సెక్టార్లనే పరిగణనలోకి తీసుకుని లెక్కించారని గుర్తుచేశారు. గతంలో షమీమ్ అఖ్తర్ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిందన్నారు. ఈ నేపథ్యాన మాలలకు జరిగిన అన్యాయంపై తాను ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడతానని చెప్పారు. అలాగే, వర్గీకరణపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీలోని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో చర్చించి మాలలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని తాను ఇప్పటికే హెచ్చరించానని తెలిపారు. కాగా, మాల ఉద్యోగుల్లో ప్రస్తుతం ఆశించినంత ఆసక్తి కనిపించడం లేదని.. వారు చొరవ తీసుకుని హక్కుల సాధన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.


