చివరి సమయంలో రావొచ్చని..
రవాణా శాఖ కార్యాలయాల వారీగా ఇలా..
● స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ పరీక్షకు నాలుగు రోజులే గడువు ● ఇప్పటికీ ముందుకు రాని యాజమాన్యాలు ● ఇంకా 331 బస్సులు పరీక్షకు దూరం
అన్ని ప్రైవేట్ స్కూళ్ల బస్సులకు ఈనెల 12వ తేదీ వరకు ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఈ సర్టిఫికెట్ లేకుండా విద్యార్థులను తీసుకెళ్లినట్లు తేలితే భారీ జరిమానా విధించడమే కాక బస్సులు సీజ్ చేస్తాం. ఈ విషయమై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందుకే యాజమాన్యాలు త్వరగా ముందుకు రావాలి.
– జేఎన్.శ్రీనివాస్,
జిల్లా ఇన్‌చార్జ్ రవాణా శాఖాధికారి
ఖమ్మంక్రైం: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈనెల 15నుంచి మొదలుకానున్నాయి. ఇందులో ప్రైవేట్ పాఠశాలల బస్సులకు పాఠశాలల ప్రారంభానికి 20రోజులకు ముందే రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీ చేయించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అలాకాకుండా రోడ్డు ఎక్కితే జరిమానా విధిస్తారు. అంతేకాక బస్సులను సీజ్ చేసే అవకాశముంది. ఈ పరీక్ష కోసం 12వ తేదీ వరకు గడువు విధించగా, ఇంకా నాలుగు రోజుల సమయమే ఉంది. అయినా జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్‌నెస్ పరీక్షపై దృష్టి సారించకపోవడం గమనార్హం.
వేసవి సెలవులు ముగిసే సమయానికి స్కూల్ బస్సులను అధికారులు పరీక్షిస్తారు. ప్రధానంగా కిటికీల వద్ద ఇనుపగ్రిల్స్, ఫైర్ అలారం, మంటలు ఆర్పే యంత్రాలు, అత్యవసర ద్వారం, ఫస్ట్ ఎయిడ్ కిట్, పుస్తకాలు పెట్టుకునేందుకు హ్యాంగర్లు వంటివి బస్సుల్లో ఉండాలి. ఇవి కాక రిజిస్ట్రేషన్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లతో పాటు డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. కానీ యాజమాన్యాలు ఇప్పటివరకు ముందుకు రాకపోవడం అను మానాలకు తావిస్తోంది. చివరి సమయంలోనైతే అధికారులు ౖపైపెన పరిశీలించి సర్టి ఫికెట్ ఇస్తారని, తద్వారా బస్సుల్లో లోపాలు ఉన్నా ఏం కాదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదేజరిగితే పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడనున్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కార్యాలయం మొత్తం బస్సులు పరీక్ష పూర్తి మిగిలినవి
ఖమ్మం 514 302 202
వైరా 135 51 84
సత్తుపల్లి 120 85 35
మొత్తం 769 438 331


