పలకరించిన నైరుతి! | - | Sakshi
Sakshi News home page

పలకరించిన నైరుతి!

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

సాగుకు సై..

మండే ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం సాగుకు సిద్ధమవుతున్న రైతులు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: నైరుతి రుతు పవనాల పలకరింపుతో జిల్లా పులకరించింది. రెండు రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండగా, సోమవారం మృగశిర కార్తె ప్రారంభమైన సందర్భంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో సాగుకు ఏర్పాట్లు చేసుకున్న రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన జనానికి ఈ వర్షంతో ఉపశమనం కలిగినట్లయింది. ఓ మోస్తరు వర్షాలే అయినా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈదురుగాలులతో..

రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ఇప్పటికే ప్రవేశించగా, రానున్న రెండు, మూడు రోజుల్లో విస్తరిస్తాయని తెలుస్తోంది. ఈ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతోంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి వాతావరణమే ఉంటున్నా.. సాయంత్రం అయ్యేసరికి చల్లటి ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది.

జిల్లాలో 1.8 సెం.మీ. వర్షపాతం

జిల్లాలో ఆదివారం ఉదయం 8–30నుంచి సోమవారం ఉదయం 8–30 గంటల వరకు 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వైరాలో 6.3 సెం.మీ., రఘునాథపాలెం మండలంలో 5.7, తల్లాడలో 3.6, మధిరలో 3.3, బోనకల్‌లో 2.5 సెంటీమీటర్లు, చింతకానిలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తం 21 మండలాల్లోనూ వర్షప్రభావం కనిపించింది. ఇక సోమవారం తెల్లవారుజామున, సాయంత్రం పలు మండలాల్లో వర్షం కురిసింది. రాత్రి 7 గంటల వరకు ఖమ్మం అర్బన్‌ మండలం ఖానాపురంలో 1.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ప్రకాష్‌నగర్‌లో 1.4 సెం.మీ., ఖమ్మంరూరల్‌ మండలం పల్లెగూడెం వద్ద 1.3, తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 1.3 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా ఇంకొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, రుతుపవనాలు విస్తరించే కొద్ది వర్షాలు ఉధృతం కానున్నాయి. ఈమేరకు పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. సహజంగా ఏటా మే నెలాఖరులోనే దుక్కులు దున్నుతారు. అయితే ఈసారి వర్షాలు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతలతో అక్కడక్కడా పొడి దుక్కులే ప్రారంభించారు. ఇప్పుడు వర్షాలు మొదలుకావడంతో పత్తి తదితర మెట్ట పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

జిల్లాలో మొదలైన వర్షాలు

Advertisement
 
Advertisement
Advertisement