ఖమ్మం సహకారనగర్: జిల్లాకు కొత్తగా మంజూరైన ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, వారి ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం పంపిణీపై సంబంధిత శాఖల ఉద్యోగులు సమన్వయంతో దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాలుగేళ్లు నిండిన చిన్నారులను ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించేలా అంగన్‌వాడీ టీచర్లు కృషి చేయాల్సి ఉండగా, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, సీడీపీఓలు, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అంతేకాక చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు, ఎదుగుదల రికార్డుల పర్యవేక్షణ, ఆరోగ్య సంరక్షణ తప్పకుండా నిర్వహించాలని చెప్పారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న వైద్య పరీక్షల మాదిరిగానే ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లోనూ నిర్వహిస్తామన్నారు. జిల్లా మహిళా సంక్షేమ అధికారి ప్రమీల మాట్లాడుతూ ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లతో సమన్వయం చేసుకుంటూ అర్హులైన చిన్నారులను సమీప ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి, సీఎంఓ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ చైతన్య జైనీ


