కుష్ఠు బాధితులు ఎందరు?
అపోహలు విడనాడాలి..
● గత నెలలో నిర్వహించిన సర్వేలో 22 కేసుల గుర్తింపు ● ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 74 కేసులు ● ప్రస్తుతం కొనసాగుతున్న రెండో విడత సర్వే
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో కుష్ఠు వ్యాధి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. జాతీయ లెప్రసీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఏఎన్‌ఎంల పర్యవేక్షణలో ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. గత డిసెంబర్‌లో మొదటి విడత సర్వే పూర్తికాగా, జనవరి 30న మొదలైన రెండో విడత సర్వే ఈనెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు ఆశా కార్యకర్తలు ఎవరెవరికి మచ్చలు ఉన్నాయో గుర్తించి, అనుమానితులను వైద్యులకు చూపించడమే కాక, పరీక్షలు అనంతరం వ్యాధిని నిర్ధారిస్తారు. ఆ తర్వాత వారికి చికిత్స అందిస్తారు.
విడతల వారీగా సర్వే
ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం మేరకు 2030 నాటికి ఒక్క కుష్ఠు కేసు కూడా లేకుండా చూడాలనే సంక ల్పంతో బాధితుల గుర్తింపు కోసం ఏటా పలు విడతలుగా సర్వే నిర్వహిస్తున్నారు. గత డిసెంబర్‌లో మొదటి విడత కార్యక్రమం చేపట్టగా 22 మందికి కుష్ఠు వ్యాధి సోకినట్లు తేలింది. ప్రస్తుతం వీరికి నయం అయ్యేలా మందులు అందిస్తున్నారు.
రెండు రకాలుగా వర్గీకరణ
కుష్ఠు వ్యాధి సహజంగా సూక్ష్మ క్రిముల వల్ల చర్మం, నరాలకు సోకుతుంది. అయితే, వ్యాధి లక్షణాలు బయట పడటానికి సగటున మూడేళ్ల నుంచి ఐదేళ్ల సమయం పడుతుంది. ఈ వ్యాధి వంశపారంపర్యంగా సోకకున్నా వయసు, లింగ బేధం లేకుండా ఎవరికై నా వస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. రెండు లేక మూడు ఔషధాల కలయికతో కూడి న బహుళ ఔషధ చికిత్స ద్వారా వ్యాధి పూర్తిగా నయమవుతుంది. ఈ చికిత్స అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా లభిస్తోంది. ఒకటి నుంచి ఐదు వరకు మచ్చలు ఉంటే పాసీబాసిల్లరీ, ఐదుకంటే ఎక్కువ మచ్చలు ఉంటే మల్టీ బాసిల్లరీగా వర్గీకరిస్తారు. ఐదు లోపు మచ్చలు ఉన్న వారికి ఆరు నెలలు, ఆపై ఉంటే 12 నెలల పాటు సక్రమంగా మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. సహజ చర్మపు రంగు కంటే తక్కువ, ఎరుపు లేదా రాగి రంగు మచ్చలు ఉండి.. వాటిపై స్పర్శ, నొప్పి లేకపోతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. జిల్లాలో గత ఏడాది 72 కొత్త కేసులు నమోదైతే, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే 74 కొత్త కేసులు వెలుగు చూశాయి.
జిల్లాను కుష్ఠు రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెండో విడత ఇంటింటి సర్వే నూరు శాతం పూర్తి చేస్తాం. ప్రజలు అపోహలను విడనాడి శరీరంపై మచ్చలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలి. వ్యాధిని తొలి దశలో గుర్తించి, క్రమం తప్పక మందులు వాడితే త్వరగా నయమవుతుంది.
– డాక్టర్ డి.రామారావు, డీఎంహెచ్‌ఓ
కుష్ఠు బాధితులు ఎందరు?


