నేత్రపర్వం.. గిరిప్రదక్షిణం
ఖమ్మంగాంధీచౌక్: భక్తుల జయజయ ధ్వానాల నడుమ స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో నిర్వహించిన గిరి ప్రదక్షిణ నేత్రపర్వంగా సాగింది. స్వామి వారి జన్మనక్షత్రాన్ని(స్వాతి) పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ఈ వేడుక జరిపించారు. గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరయ్యారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీలో వేంచేపు చేసి, అర్చకుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ గుట్టచుట్టూ ఊరేగిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. నృసింహ నామ స్మరణలతో భక్తులు కీర్తనలు ఆలపించారు. స్వామి వారి విగ్రహాలను కొలువుదీర్చిన పల్లకీని మోసేందుకు పోటీ పడ్డారు. ప్రదక్షిణ అనంతరం గుట్టపై ఉన్న రాతి కొండపై నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని పండితులు వెలిగించారు. ఈ సమయాన నృసింహ నామ స్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్ రావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
వైభవంగా నృసింహుడి ఊరేగింపు
నేత్రపర్వం.. గిరిప్రదక్షిణం


