సింగరేణిలో భారీగా అవినీతి | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో భారీగా అవినీతి

Feb 9 2026 7:26 AM | Updated on Feb 9 2026 7:26 AM

సింగరేణిలో భారీగా అవినీతి

సింగరేణిలో భారీగా అవినీతి

● రెండు పార్టీలు సంస్థను నిర్వీర్యం చేశాయి ● కొత్తగూడేన్ని అమృత్‌ సిటీగా మార్చుతాం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

● రెండు పార్టీలు సంస్థను నిర్వీర్యం చేశాయి ● కొత్తగూడేన్ని అమృత్‌ సిటీగా మార్చుతాం ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

చుంచుపల్లి: సింగరేణి టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని, పారదర్శకత లేపోవడంతోనే ఆరోపణలు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు అన్నారు. ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విజయ సంకల్ప సభలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు సింగరేణిని నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. ఫలితంగా సింగరేణి నేడు కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరిందని అన్నారు. కార్మికులకు అండగా నిలుస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని, సింగరేణి పరిస్థితిని పరిగణనలో తీసుకుని ఇటీవల రూ.2,500 కోట్లను మంజూరు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ చేవెళ్ల, కామారెడ్డిలలో చేసిన గ్యారంటీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా జేబులు నింపుకున్నారని విమర్శించారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌ ప్రమాదంపై అనుమానాలు

ఎఫ్‌ఎస్‌ఎల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో అనుమానాలు ఉన్నాయని రామచందర్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సైతం సెక్రటేరియట్‌లో ఫైళ్లు దగ్ధమయ్యాయని, ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ సంబంధించిన ముఖ్యమైన రికార్డులు తగలబడి పోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రెండు పార్టీల తప్పులు బయటికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సంఘటనలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అవినీతి వ్యవహారంలో అధికారులను అరెస్ట్‌ చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద నాయకులను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదన్నారు. కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ను అమృత్‌ సిటీగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్‌ను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐలు పట్టించుకోకపోవడంతో గోదావరి పక్కనే ఉన్న ప్రతీ ఇంటికి నీళ్లు కూడా రాలేదన్నారు. కార్పొరేషన్‌ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధిని చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు జీవీకే మనోహర్‌, రంగాకిరణ్‌, ముసుగు శ్రీనివాసరెడ్డి, పొడియం బాలరాజు, విద్యాసాగర్‌, గొడుగు శ్రీధర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement