బంకుల్లో డీజిల్ కొట్టించి పరారీ..
ఖమ్మంఅర్బన్/చింతకాని: కారులో షికారుకు వచ్చి.. పెట్రోల్ బంకుల్లో ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించుకొని డబ్బులు చెల్లించకుండా పరారవుతున్న వ్యక్తులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 22న ఖమ్మం నగరంలోని ధంసలాపురం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించుకున్నారు. డబ్బులు చెల్లించే క్రమంలో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై బంకు నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. ఆదివారం అదే కారు నాడు పెట్రోల్ కొట్టించిన సమయంలో ఉన్న టీఆర్ నంబర్‌తో నగరంలో కనిపించడంతో బంకు నిర్వాహకులు ఇందిరానగర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయంతో నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. ఖమ్మం అర్బన్ పోలీసులు అక్కడికి చేరుకొని కారు సహా, వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ కోసం తరలించారు. ఇదే తరహాలో జిల్లాలోని బోనకల్, నాగులంచ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లోనూ ఇంధనం కొట్టించుకొని డబ్బులు చెల్లించకుండా ఉడాయించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందడంతో ఆయా ప్రాంతాల పోలీసులు సైతం ఖమ్మం చేరుకున్నట్లు తెలిసింది. ఖమ్మంఅర్బన్ సీఐ భానుప్రకాష్‌ను వివరణ కోరగా.. విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా, చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని పెట్రోల్ బంకులో కారులో వచ్చిన కొందరు ఫుల్‌ట్యాంక్ డీజిల్ కొట్టించుకుని పరారవ్వగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కారు సహా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు


