మధిరలో టెన్షన్.. టెన్షన్
● సీపీఎం నిరసన పిలుపుతో ముందస్తు అరెస్టులు ● అడుగడుగునా పోలీసు బందోబస్తు
మధిర: మధిర నియోజకవర్గంలో కొన్నాళ్ల క్రితం సీపీఎం నేతను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోవడమే కాక ఇటీవల పలువురిపై దాడులకు పాల్పడడంతో పాటు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని సీపీఎం ఆధ్వర్యాన శనివారం నిరసన తెలిపారు. ఈమేరకు నియోజకవర్గ వ్యాప్తంగానే కాక ఖమ్మంలోనూ పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పాతర్లపాడులో సీపీఎం నేత సామినేని రామారావు హత్య జరిగి నప్పటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికల వరకు జరిగిన ఘటనల్లో సీపీఎం నాయకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై విమర్శలు చేస్తున్న విషయం విదితమే. ఈనేపథ్యాన మధిరలో నిరసన తెలపనున్నట్టు ప్రకటించగా పోలీసులు అప్రమత్తమయ్యారు. మధిరలో భారీ బందోబస్తు ఏర్పాటుచేయడమే కాక డిప్యూటీ సీఎం భట్టి క్యాంపు కార్యాలయం వద్ద మోహరించారు. నిరసన ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నాయకులు పాల్గొనగా భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తారనే అనుమానంతో బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే, నిరసన శాంతియుతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


