ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
చర్ల: పేద, బలహీన వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల్లో నుంచే కమ్యూనిస్టు పార్టీ పుట్టుకొచ్చిందని, ఉద్యమాలతోనే ఆ సమస్యలు పరిష్కారం అయ్యాయని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో చర్ల మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రచార జాతాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరగిన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ వందేళ్ల ప్రస్థానంలో అనేక సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడి విజయం సాధించామని, గిరిజనులు, దళితులు ఎదుర్కొంటున్న భూ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరావు, నాయకులు అడ్డగర్ల తాతాజీ, కోటి ముత్యాలరావు, చల్లా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీపీఐ ప్రజార జాతాకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ నల్లపు దుర్గాప్రసాద్, నాయకులు బండారు రామకృష్ణ, భాస్కర్‌రావు, మురళి సంఘీభావం తెలిపారు.
ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులే..
దుమ్ముగూడెం : ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. చర్లలో ప్రారంభమైన జీపు జాతా దుమ్ముగూడెం చేరగా.. అక్కడి సభలో ఆయన మాట్లాడారు. దుమ్ముగూడెం మండలంలో అమరుల త్యాగాలతో వందల ఎకరాల భూములను పేద గిరిజనులకు పంచిన ఘనత కమ్యూనిస్టులదేనని అన్నారు. ఖమ్మంలో జరిగే పార్టీ శత వసంతాల ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పుల్లారెడ్డి, నున్నా లక్ష్మీకుమార్, బొల్లోజు వేణు, తాటిపూడి రమేష్, నోముల రామిరెడ్డి, గొంది నాగేశ్వరరావు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ


