● అందుబాటులో 13,795 మెట్రిక్ టన్నుల యూరియా ● కలెక్టర్
యూరియాపై ఆందోళన వద్దు
చింతకాని: జిల్లాలో 13,975 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నందున రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. చింతకాని మండలం నాగులవంచ పీఏసీఎస్‌లో యూరియా పంపిణీని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మార్క్‌ఫెడ్ వద్ద 9,736 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్‌ల్లో 900 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 663 మెట్రిక్ టన్నులే కాక బఫర్ స్టాక్‌గా 2,495 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. ప్రతీ 2 వేల ఎకరాల విస్తీర్ణానికి ఒక సేల్ పాయింట్ ఏర్పాటు చేయడంతో పాటు యూరియా కోసం రైతులు ఎప్పుడు రావాలో ముందస్తు సమాచారం ఇచ్చి కూపన్లను జారీ చేస్తున్నట్లు చెప్పారు. అధికారులకు రైతులు సహకరిస్తూ సూచించిన సమయంలో యూరియా తీసుకెళ్లాలని, అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయవద్దని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, మధిర ఏడీఏ విజయ్‌చంద్ర, తహసీల్దార్ బాబీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల మ్యాపింగ్ వేగంగా పూర్తిచేయాలి
ఖమ్మంసహకారనగర్: ఎస్.ఐ.ఆర్–2002 ఆధారంగా ప్రస్తుత ఓటర్ల జాబితా మ్యాపింగ్ వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ జాబితాపై సూచనలు చేశారు. ప్రతీ బూత్ స్థాయి అధికారి రోజుకు 30 ఎంట్రీలు, సూపర్‌వైజర్లు 300 ఎంట్రీలు మ్యాపింగ్ చేసేలా లక్ష్యాలను నిర్దేశించాలని తెలిపారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఎస్‌డీసీ రాజేశ్వరి, ఆర్‌డీఓ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.


