ఏఐతో రాంగ్ డ్రైవింగ్, వేగానికి చెక్
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న 30 జంక్షన్ల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. జిల్లాలో మూడేళ్లలో జరిగిన 3,200 ప్రమాదాల్లో 50 శాతం జంక్షన్ల వద్దే జరిగాయని తెలిపారు. ఆయా చోట్ల రంబుల్ స్ట్రిప్స్, లేన్ మార్కింగ్ చేయడమే కాక ఆక్రమణలు తొలగింపు పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అంతేకాక అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణదారులకు నోటీసులు ఇవ్వాలని తెలిపారు. అలాగే, ఏఐ సాంకేతికత వా డుతూ రాంగ్ డ్రైవింగ్, వేగంగా ప్రయాణించే వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వైన్స్ దుకాణాల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత యజమానులపై ఉందని అవగాహన కల్పించాలన్నారు. కాగా, విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను పరిశీలించి సామర్థ్యానికి మించి పిల్లలను తీసుకెళ్లకుండా పర్యవేక్షించాలని సూచించారు. డీఆర్‌ఓ ఎ.పద్మశ్రీ, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


