
పంటల నమోదుకు సిద్ధం
నిర్దేశిత విధానంలో నమోదు
● మొబైల్ యాప్ ద్వారా వివరాల నమోదు ● వరి రకాల గుర్తింపు తప్పనిసరి
ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాగవుతున్న పంటల నమోదు(క్రాప్ బుకింగ్)పై విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయ విస్తర్ణాధికారులు(ఏఈఓలు) క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి మొబైల్ యాప్‌లో ఫొటో సహా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఏఈఓల్లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లాలోని 21 మండలాల పరిధి 129 క్లస్టర్లలో సాగవుతున్న పంటలను నమోదు చేశాక, రైతులకు ఎస్‌ఎంఎస్ ద్వారా వివరాలు పంపిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 25 నాటికి క్రాప్ బుకింగ్ పూర్తి చేసి అక్టోబర్ 27న గ్రామపంచాయతీల్లో వివరాలు ప్రదర్శించాల్సి ఉంది. అందులో తప్పులు ఉంటే నవంబర్ 1వరకు దరఖాస్తులు స్వీకరించి సరిచేశాక తుది జాబితాను నవంబర్ 5న ప్రదర్శిస్తారు.
వివరాల సేకరణ ఇలా...
ప్రతీ ఏఈఓ క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించాక మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయాలి. మహిళా ఏఈఓలు కనీసం 1,800 ఎకరాల్లో, పురుషులైతే 2వేల ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలి. మిగిలిన విస్తీర్ణానికి సంబంధించి సాధారణ పద్ధతిలో నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాక వరి రకాల వివరాలు తప్పనిసరిగా పేర్కొనాలి. సన్నధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తున్నందున కొనుగోలు సమయాన సులువయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక డిజిటల్ బుకింగ్ కోసం ఎక్కువ విస్తీర్ణం ఉన్న గ్రామాన్ని ఎంపిక చేయాలి. కాగా, రైతు పేరు, ఆధార్, మొబైల్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
పంట నమోదును నిబంధనల మేరకు నిర్దేశిత విధానంలో చేపట్టాలి. గడువులోగా ప్రక్రియను పూర్తి చేసి జాబితా ప్రదర్శించేలా ఏఈఓలకు అవగాహన కల్పించాం. క్షేత్రస్థాయిలో పరిశీలించాకే మొబైల్ యాప్ ద్వారా ఏఈఓలు వివరాలు నమోదు చేయాలి.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి