
పర్యావరణ హితమే లక్ష్యం
12ఏళ్లుగా ప్రోత్సాహం
● మట్టి విగ్రహాల వినియోగంతో ఇది సాధ్యం ● మట్టి ప్రతిమల పంపిణీలో వక్తలు ● ‘సాక్షి’, స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యాన పంపిణీ
ఖమ్మంగాంధీచౌక్: సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ‘సాక్షి’ మీడియా గ్రూప్, స్తంభాద్రి ఉత్సవ సమితి సంయుక్త ఆధ్వర్యాన మంగళవారం మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఖమ్మం పెవిలియన్ మైదానం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విగ్రహాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్తంభాద్రి ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వినోద్ లాహోటి, కీసర జయపాల్‌రెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షుడు గెంటేల విద్యాసాగర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అల్లిక అంజయ్య మాట్లాడారు. అందరికీ ప్రీతిపాత్రమైన వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ హితంగా జరుపుకునేలా మట్టి ప్రతిమలు ప్రతిష్ఠించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంతో నీరు కాలుష్యం కావడమే కాక జలరాశుల మనుగడ దెబ్బతింటుందన్నారు. ఏటా మండపాలు పెరుగుతున్నందున మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరుపుకునేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి బాధ్యులు మూలగుండ్ల శ్రీహరి, నూకల మోహన్ కృష్ణ, జమ్మి శ్రవణ్‌కుమార్, బోయినపల్లి కోటిరెడ్డితో పాటు ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి బొల్లం శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ జి.మోహన్‌కృష్ణ, సాక్షి టీవీ ప్రతినిధి పసునూరి మహేందర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ రాధారపు రాజుతో పాటు జి.జవహర్‌రెడ్డి, జె.ఉపేందర్, సతీష్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం. గణపతి పూజకు ప్రాధాన్యత ఇస్తూనే పర్యావరణ రక్షణ బాధ్యత అందరిపై ఉంది. గత 33 ఏళ్లుగా సమితి ఆధ్వర్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ, 12ఏళ్లుగా మట్టి ప్రతిమలను ప్రోత్సహిస్తున్నాం. – వినోద్ లాహోటి,
స్తంభాద్రి ఉత్సవ సమితి అధ్యక్షుడు

పర్యావరణ హితమే లక్ష్యం