
విద్యార్థులకు తపాలా స్కాలర్‌షిప్‌లు
ఖమ్మంగాంధీచౌక్ : దీన్ దయాళ్ స్పర్శ యోజన పథకం కింద 2025 – 26 సంవత్సర పిలాటలీ స్కాలర్‌షిప్ పథకానికి 6 నుంచి 9వ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్ర స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పిలాటలీ క్విజ్, ప్రాజెక్టు కార్యక్రమాలను పోస్టల్ డివిజనల్, రీజనల్/సర్కిల్ స్థాయిలో నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన వారికి నెలకు రూ. 500 చొప్పున ఏడాదికి రూ. 6 వేలు అందిస్తామని తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ‘సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఖమ్మం డివిజన్, ఖమ్మం 507003’ అడ్రస్‌కు సెప్టెంబర్ 13 లోగా పంపించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు www.indiapost.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
21న జిల్లాస్థాయి
అథ్లెటిక్స్ ఎంపికలు
ఖమ్మం స్పోర్ట్స్ : నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 21న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.డి.షఫీక్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికలకు ఎంపికలు జరుగుతాయని, ఆసక్తి గలవారు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారిని ఈనెల 30, 31 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు పంపిస్తామని తెలిపారు. క్రీడాకారులు 21న ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు.
విస్తారంగా వర్షాలు
కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం
ఖమ్మంవ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి వర్షం సోమవారం రాత్రి వరకు వాన కొనసాగుతూనే ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి కల్లూరు మండలంలో అధికంగా 27.6 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఖమ్మం రూరల్ మండలంలో 17.6, బోనకల్‌లో 14.2, ముదిగొండ, సత్తుపల్లిలో 12.8, చింతకానిలో 11.4, ఖమ్మం అర్బన్‌లో 10.2 మి.మీ. నమోదు కాగా, మిగిలిన మండలాల్లో 10 మి.మీ. లోపు వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా వర్షపు జల్లులు కొనసాగుతూనే ఉన్నాయి. మధిర మండలం సిరిపురంలో 11.3, రావినూతలలో 10.3 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, మిగిలిన ప్రాంతాల్లో 10 మి.మీ.లోపు వర్షపాతం నమోదంది. అయితే ఎగువన కురిసిన వర్షాలతో జిల్లా మీదుగా ప్రవహించే వాగుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. మున్నేరు, బుగ్గవాగు తదితర వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
విద్యుత్ వినియోగదారులు
అప్రమత్తంగా ఉండాలి..
విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యాన విద్యుత్ వినియోగదారులు, ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం విద్యుత్ సర్కిల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
గోదావరిలో
వరద ఉధృతి
భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి మూడు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతోపాటు ఎగువన ఉన్న కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్‌ల నుంచి వరదనీరు వస్తోంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 36.50 అడుగులకు చేరింది. సాయంత్రం 5 గంటలకు 37.70 అడుగులకు పెరిగింది. నది ఒడ్డున మెట్లప్రాంతంలోని తాత్కాలిక స్నానపు గదులు నీటమునిగాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి, దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పర్ణశాలలోని నారచీరల ప్రాంతంలో ఉన్న సీతమ్మవారి విగ్రహం పూర్తిగా నీట మునిగింది. సున్నంబట్టి–బైరాగులపాడు గ్రామాల మధ్య రహదారిపైకి వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి.