
సమయపాలన పాటించాలి
● ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఖమ్మం సహకారనగర్ : కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా హాజరు నమోదు చేయడంతో పాటు సమయపాలన పాటించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. జనవరి ఒకటి నుంచి ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద 37, డీఈఓ వద్ద 28, సర్వే ల్యాండ్ రికార్డ్స్ 26, ఎన్‌పీడీసీఎల్ 22, జీజీహెచ్ 17, వైద్యారోగ్య శాఖ 8, పంచాయతీరాజ్ శాఖ వద్ద ఏడు ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని వివరించారు. వీటితో పాటు సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను జిల్లా అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యాలయాలకు ప్రజాప్రతినిధులు పంపే ప్రతీ దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలని, ఆ పని పూర్తి చేయలేకుంటే అందుకు గల కారణాలు తెలుపుతూ లేఖ రాయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని ఇలా..
● ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన కొప్పుల బుచ్చమ్మ.. తన భర్త నుంచి వారసత్వంగా సంక్రమించిన భూమి తన పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదుకు కుమార్తెలు అడ్డుపడుతూ, వృద్ధాప్యంలో ఉన్న తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేసింది.
● ఖమ్మం నగరానికి చెందిన జోగుపర్తి వెంకమ్మ.. తన ఇద్దరు కుమారులపై గతంలో ఫిర్యాదు చేశానని, కలెక్టర్ గత ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డర్‌ను వారు పాటించడం లేదని తెలపగా సీనియర్ సిటిజన్ సంరక్షణ చట్ట ప్రకారం అవార్డు అమలయ్యేలా చూడాలని డీడబ్ల్యూఓకు సూచించారు.
● వేంసూర్ మండలం మర్లపాడుకు చెందిన పిల్లి సర్వేష్ తనకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరాడు.