
టెండర్లకు గ్రీన్ సిగ్నల్..
● జిల్లాలో 3.49 కోట్ల చేప పిల్లలకు అనుమతి ● టెండర్ దాఖలుకు సెప్టెంబర్ 1 తుది గడువు ● డీపీసీ పర్యవేక్షణలో ప్రక్రియ నిర్వహణ
ఖమ్మంవ్యవసాయం: చేప పిల్లల టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆనుమతి మేరకు చేప పిల్లల టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ నిఖిల సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 882 చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి మత్స్యశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ చెరువుల్లో నీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చేప పిల్లలు వదిలేందుకు అవసరమైన ప్రణాళికలు చేశారు. విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో జలాశయాల్లోకి నీరు చేరడంతో చేప పిల్లల పెంపకానికి మెరుగైన వనరులున్నాయి.
జిల్లాలో 3.49 కోట్ల చేప పిల్లలకు..
జిల్లాలో జలాశయాల విస్తీర్ణం, వనరుల ఆధారంగా 3.49 కోట్ల చేప పిల్లలకు టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర మత్స్యశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు దీర్ఘకాలం, స్వల్పకాలం నీటి సౌకర్యం ఉండే జలాశయాలను గుర్తించి వివిధ సైజుల్లో ఉన్న చేప పిల్లలను వదిలేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 35 – 40 మి.మీ. సైజు చేప పిల్లలు 1.38 కోట్లు కాగా 80 – 100 మి.మీ. సైజు చేప పిల్లలు 2.11 కోట్ల పిల్లలకు టెండర్లు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సెప్టెంబర్ 1 వరకు అవకాశం..
చేప పిల్లల టెండర్లకు సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు అవకాశం ఇచ్చారు. ఈ – ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫాంపై కాంట్రాక్టర్లు టెండర్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. టెండర్లు వేసేవారికి చేప పిల్లల పెంపకానికి అవసరమైన చెరువులు ఉండాలి. కనీసం మూడేళ్ల పాటు చేప పిల్లల పెంపకం, టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న అనుభవం వంటి అర్హతలను ప్రామాణికంగా తీసుకుని అనుమతి ఇస్తారు. ఈ ప్రక్రియలో కాంట్రాక్టర్లు ఈఎండీ రూ. 8.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
డీపీసీ పర్యవేక్షణలో..
చేప పిల్లల పథకానికి రూపొందించిన జిల్లా పర్చేజింగ్ కమిటీ పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ కమిటీకి చైర్మన్‌గా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తుండగా, సభ్యులుగా జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్, ఎలక్ట్రానిక్ జిల్లా మేనేజర్ ఉంటారు. ఈ కమిటీ పర్యవేక్షణలో టెండర్ల నిర్వహణ ఉంటుంది. సెప్టెంబర్ 1వ తేదీ 3 గంటల వరకు టెండర్లను నిర్వహించి ఆ తరువాత ఓపెన్ చేస్తారు. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ అప్పగిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు.