
వరద పరిస్థితిపై సీసీ కెమెరాలతో నిఘా..
గతేడాది వచ్చిన అనూహ్య వరదల దృష్ట్యా ముందు జాగ్రత్తలకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం తన చాంబర్‌లో ఆకేరు, మున్నేరుల వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తుగా వరద పరిస్థితి తెలుసుకొని, సహాయక చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వరదల సమాచారం తెలుసుకునేందుకు ఆకేరుకు సంబంధించి తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం వద్ద, మున్నేరుకు సంబంధించి డోర్నకల్ వద్ద సోలార్ డే అండ్ నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేసి, 24/7 గంటల పర్యవేక్షణ చేయనున్నామని వెల్లడించారు. ఈ కెమెరాలను కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్, తన చాంబర్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. 24 గంటలు నీటి ప్రవాహం ప్రత్యక్షంగా చూస్తూ, ప్రమాద పరిస్థితిని ముందస్తుగా అంచనా వేసి, అవసరమైతే ముంపు ప్రాంతాల ప్రజలకు నష్టం వాటిల్లకుండా సురక్షిత ప్రాంతానికి లేదా పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టవచ్చన్నారు. ఈ కెమెరాలతో అధికారులు మొబైల్ ఫోన్ల ద్వారా పర్యవేక్షించవచ్చన్నారు. నగరంలోని కాల్వొడ్డులోనూ ఈ తరహా కెమెరా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.