
కీలక పదవులు ఖాళీ...
● జలనవరుల శాఖలో అధికారుల కొరత ● ఉమ్మడి జిల్లాలో ఖాళీగా 8ఈఈ పోస్టులు
ఖమ్మంఅర్బన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జలవనరుల శాఖను అధికారుల కొరత వేధిస్తోంది. కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో సాగునీటి పంపిణీ పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా అధికారులు రిటైర్ అవుతుండగా.. ఆ స్థానాలను భర్తీ చేయకపోవడంతో ఎనిమిది ఈఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. పలువురికి ఎస్‌ఈలుగా పదోన్నతి లభించడంతో కొరత మరింత పెరిగింది.
కీలకమైన సమయమిది...
ఓవైపు వానాకాలం పంటల సాగు ముమ్మరంగా సాగుతోంది. సాగర్ నుంచి నీరు విడుదలవుతుండగా.. జిల్లాలోనూ భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఈ సమయాన సాగునీటి సరఫరా, పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు లేకపోవడంతో రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలోని పలు డివిజన్ల పరిధిలో సకాలంలో సాగునీరు సదుపాయం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క కీలకపోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న ఉద్యోగులపై భారం పడి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
సీఈ పోస్టూ ఖాళీనే...
ఖమ్మం జలవనరుల శాఖ సీఈ పోస్టు కూడా కొద్దినెలలుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం సూర్యాపేట సీఈ, జలవనరుల శాఖ ఈఎన్‌సీ రమేష్‌బాబు ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాక పాలేరు, మధిర, కల్లూరు ఈఈ పోస్టులు, ఖమ్మం డీసీఈ, కల్లూరు డిప్యూటీ ఎస్‌ఈ పోస్టులూ మార్చి నుంచి ఖాళీగానే ఉన్నాయి. మరోపక్క కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం డివిజన్లలో ఈఈ, డీఎస్‌సీ పోస్టులు కూడా ఇటీవల పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యాయి. ఈ మేరకు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం స్పందించి జలవనరుల శాఖలో ఇంజనీరింగ్ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.