
ప్రజలను అప్రమత్తం చేయండి
పోలీసు కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మం క్రైం: మున్నేటిలో వరద ఉధృతి నేపథ్యాన పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఆదేశించారు. ఖమ్మంలోని కాల్వొడ్డు ప్రాంతంలో శుక్రవారం రాత్రి పర్యటించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. అలాగే, చెరువులు, వాగుల ఉధృతి దృష్ట్యా ప్రజలెవరూ రోడ్డు దాటే ప్రయత్నం చేయొద్దని, చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59111, కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ 1077, 90632 11298 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ తెలిపారు.
అదనపు డీసీపీ పరిశీలన
ఖమ్మంరూరల్/కూసుమంచి: ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట వద్ద మున్నేటిని, కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌ను అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు సూచనలు చేయడంతో ప్రజలను అప్రమత్తం చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈకార్యక్రమాల్లో ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐలు ముష్క రాజు, సంజీవ్, ఎస్పై నాగరాజు పాల్గొన్నారు.
నామినేషన్ల స్వీకరణ షురూ
పాల్వంచ: టీజీ జెన్‌కో పరిధిలోని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఈ ఎన్నికలు రాష్ట్రంలోని 25ప్రాంతాల్లో ఈనెల 30న నిర్వహించనుండగా.. 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఓట్ల లెక్కింపు కేటీపీఎస్‌లో సెప్టెంబర్ 2న చేపడతారు. తొలిరోజు కేటీపీఎస్ ఐదో దశకు చెందిన ఏఈ జి.కీర్తి ఫైనాన్స్ సెక్రటరీ పదవికి, 7వ దశకు చెందిన ఏఈ పి.నవీన్ జాయింట్ సెక్రటరీ(థర్మల్) పదవికి నామినేషన్లు దాఖలు చేశారు.