ఎగువ జిల్లాల్లో భారీ వర్షానికి తోడు జిల్లాలోనూ శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో వరద పెరిగింది. మున్నేరు, ఆకేరు, వైరా, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లోలెవల్ వంతెనలపైకి వరద చేరడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈమేరకు అధికారులు వరద పరిస్థితిని తెలుసుకుంటూ ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
● ఎగువన వర్షాలతో మున్నేరు, ఆకేరుకు భారీగా వరద ● నిండుకుండల్లా పాలేరు, వైరా రిజర్వాయర్లు, చెరువులు ● పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు బ్రేక్ ● మున్నేటి వరదను పరిశీలించిన కలెక్టర్, కమిషనర్
● ఎగువన భారీ వర్షంతో మున్నేటికి వరద పెరిగింది. శనివారం ఉదయం 7గంటలకు కాల్వొడ్డు ఫ్లడ్ గేజ్ వద్ద 9.5 అడుగులుగా ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం12 గంటలకు 12.5, ఒంటి గంటకు 13, సాయంత్రం 4.30గంటల సమయాన 14.5 అడుగులకు, 6గంటలకు సమయాన 15అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షంతో మున్నేరు, ఆకేరులకు వరద భారీగా చేరుతోంది. దీంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కేఎంసీ, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్‌అగస్త్య, శ్రీనివాసరెడ్డి ఇరువైపులా పరిశీలించి స్థానికులకు సూచనలు చేశారు. నీటిమట్టం 16అడుగులు దాటితే ప్రభావిత ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు.
● కొణిజర్ల మండలం తీగలబంజరవద్ద పగిడేరు ఉధృతంగా ప్రవహించడంతో పల్లిపాడు – ఏన్కూరు రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. తల్లాడ మండలం బిల్లుపాడు – రామచంద్రాపురం మధ్య వాగు లోలెవల్ బ్రిడ్జి పైనుంచి ఉధృతంగా ప్రవహించడంతో రామచంద్రాపురం, వెంగన్నపేటకు రాకపోకలు బంద్ అయ్యాయి. మిట్టపల్లి వద్ద గంగదేవిపాడు వాగు పొంగి ప్రవహిస్తోంది.
● కారేపల్లి మండలం పేరుపల్లి వద్ద బుగ్గవాగు ఉధృతితో లోలెవల్ బ్రిడ్జి మునిగింది. దీంతో పేరుపల్లి – మాదారం మధ్య రాకపోకలు నిలిచాయి. ఈ గ్రామాల సమీపాన డబుల్‌బెడ్ రూం ఇళ్లకు వరద తాకడంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
● వైరా రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో ఐదు అలుగుల ద్వారా వరద బయటకు వెళ్తోంది. ఈ వరద దిగువన వాగులోకి చేరడంతో సాన్నాలలక్ష్మీపురం, సిరిపురం, పుణ్యపురం, గన్నవరం, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నెమలి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా 20 అడుగులకు చేరింది. ఈ కారణంగా రాజీవ్‌నగర్‌కాలనీకి వరద చేరడంతో నిర్వాసితులను పునరావాస కేంద్రానికి పంపించారు.
● మున్నేరు, పాలేరుకు వరద పెరగడంతో అడిషనల్ డీసీపీ ప్రసాదరావు పరిశీలించారు. నీట మునిగిన రోడ్లు, వాగులు దాటకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వరద ఉధృతి ఎక్కువ ఉన్న వాగుల వద్ద పెట్రోలింగ్ ఏర్పాటుచేయాలని తెలిపారు.
● పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా 23.25 అడుగులు, లంకాసాగర్ 16 అడుగులకు గాను 14.8 అడుగుల మేర వర ద చేరింది. జిల్లాలోని 1,061 చెరువులకు గాను 326 చెరువులు పూర్తిగా నిండి అలుగుపోస్తున్నా యి. 222 చెరువులు 90–100 శాతం, 205 చెరువులు 75–నుంచి 90శాతం వరకు నిండాయి.
● జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 8–30 గంటల నుంచి శనివారం ఉదయం 8–30 గంటల వరకు వర్షం దంచికొట్టింది. జిల్లా వ్యాప్తంగా సగటున 2.7 సె.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొణిజర్లలో 7సెం.మీ, కారేపల్లిలో 6.1, వైరాలో 5.5, కూసుమంచిలో 4.7, కామేపల్లిలో 4.6, ఏన్కూరులో 4.2, రఘునాథపాలెంలో 4.0, ముదిగొండలో 3.3, నేలకొండపల్లిలో 3.2, ఖమ్మంఅర్బన్‌లో 3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
● మున్నేటికి అంతకంతకూ వరద పెరుగుతున్న కలెక్టర్, సహా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అధికారులతో సమీక్షించిన ఆయన వరద ముప్పు, పరీవాహక ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడంపై సూచనలు చేశారు.
వానొచ్చే.. వరదొచ్చే
వానొచ్చే.. వరదొచ్చే