
జిల్లాలో క్షీణించిన శాంతిభద్రతలు
ఖమ్మవైరారోడ్: జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆరోపించారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండగా అభివృద్ధి మాటేమో కానీ మునుపెన్నడూ లేని విధంగా శాంతిభద్రతలు ప్రమాదంలో పడడంతో ప్రజలు ఆందోళనగా గడుపుతున్నారని తెలిపారు. ఎప్పుడు ఎక్కడ చోరీ జరుగుతుందో, ఎవరిపై ఆగంతకులు దాడి చేస్తారోనన్న భయంతో గడపాల్సి వస్తోందని చెప్పారు. మంత్రులు నివాసముండే కాలనీల్లోనే దొంగలు మారణాయుధాలతో తిరుగుతుండగా, హోటళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ మంత్రుల ప్రొటోకాల్‌కే సరిపోతుండడంతో ఉద్యోగ భాధ్యతలు నిర్వర్తించే సమయం చిక్కడం లేదని తాతా మధు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్‌ఎస్ ఖమ్మం నగర, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల అధ్యక్షులు పగడాల నాగరాజు, బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, కార్పొరేటర్ మక్బూల్, నాయకులు ఖమర్, బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, బిచ్చాల తిరుమలరావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్