
హత్యకు కుట్ర పన్నిన యువకుడిపై ఫిర్యాదు
కామేపల్లి: బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల హత్యకు ఓ యువకుడు కుట్ర పన్నాడని పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మద్దులపల్లికి చెందిన బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు సామా మోహన్‌రెడ్డి, నూకల ఉపేందర్ మాట్లాడుతూ తమను హత్య చేసేందుకు గడబోయిన హరీష్ మహబూబాబాద్ జిల్లాలోని ఓ రౌడీ షీటర్‌తో రూ.4 లక్షలకు సుపారీ కుదుర్చుకుని రూ.లక్ష చెల్లించినట్లు ఆడియో లీక్ అయిందని తెలిపారు. ఈమేరకు తమకు ప్రాణహానీ ఉన్నందున రక్షణ కల్పించడంతో పాటు పూర్తిస్థాయిలో విచారించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కాగా, బీఆర్‌ఎస్ నాయకులపై హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రౌడీయిజం పెరిగిందని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే రౌడీషీటర్ ఉంటుండడం ఇందుకు నిదర్శమని తెలిపారు. అలాగే, తమ బీఆర్‌ఎస్ నాయకుల హత్యకు కుట్ర పన్నిన వారిపై చర్యలు తీసుకోవాలని మద్దులపల్లి కాంగ్రెస్, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.