
పాత పద్ధతిలోనే ఎస్సెస్సీ పరీక్షలు
80 మార్కులకు పరీక్ష.. ఇంటర్నల్ మార్కులు 20
ఖమ్మం సహకారనగర్: పదో తరగతి విద్యార్థులకు పాత విధానంలో వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయింది. గత ఏడాది వరకు 80మార్కులు పరీక్ష ద్వారా, 20మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా కేటాయించేవారు. కానీ ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయంటూ ప్రభుత్వం గతేడాది పరీక్షల సమయాన 100 మార్కులకు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అయినా ఇది అమలుకు నోచుకోలేదు. ఇక ఈ విద్యాసంవత్సరం మాత్రం ఇంటర్నల్ మార్కులు తొలగిస్తామని ముందు నుంచి చెబుతుండగా.. మళ్లీ పాత పద్ధతిలోనే నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. జిల్లాలోని 212 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6,500మంది పదో తరగతి చదువుతుండగా, వీరికి థియరీతో పాటు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని అమలుచేస్తారు.
ఇప్పటికే పూర్తయిన ఎస్‌ఏ–1
పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ)–1 పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం నాలుగు విడతలుగా ఎఫ్‌ఏ పరీక్షలు నిర్వహించి.. ప్రత్యేక బృందాల ద్వారా జవాబుపత్రాల పరిశీలన చేపడుతారు. పరీక్షల్లోని మార్కుల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి ఇంటర్నల్ మార్కులు కేటాయిస్తారు. ఆపై మిగతా 80మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈవిషయమై జిల్లా పరీక్షల బోర్డు(డీసీఈబీ) కార్యదర్శి కనపర్తి వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటర్నల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షిస్తామని తెలిపారు.