
యూరియా కోసం రైతుల రాస్తారోకో
కల్లూరురూరల్: తమకు సరిపడా యూరియా అందజేయాలని కోరుతూ కల్లూరు మండలం చెన్నూరు పీఏసీఎస్ ఎదుట రైతులు రాస్తారోకో చేపట్టారు. యూరియా అరకొరగా పంపిణీ చేస్తున్నారని, నెలకు ఒకసారి మాత్రమే ఇస్తుండడంతో పంటలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ఎస్సై హరిత ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎరువుల కోసం తమ కుటుంబాలు క్యూలైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. జిల్లాకు 7,500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 4,500 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో రైతులు, రైతు సంఘం నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, రావూరి వెంకటేశ్వరరావు, ఆళ్ల శ్రీకాంత్, దంతాల లక్ష్మయ్య, నల్లమాటి రామకృష్ణ, మాదాల భద్రయ్య, గింజుపల్లి అర్జున్‌రావు పాల్గొన్నారు.