పదేళ్లలో అత్యధికం.. 37.5అడుగులు | - | Sakshi
Sakshi News home page

పదేళ్లలో అత్యధికం.. 37.5అడుగులు

Aug 15 2025 6:56 AM | Updated on Aug 15 2025 6:56 AM

పదేళ్

పదేళ్లలో అత్యధికం.. 37.5అడుగులు

● రెండేళ్లుగా వణుకుతున్న మున్నేటి పరీవాహకం ● గతేడాది భారీ నష్టాన్ని మిగిల్చిన వరద ● ప్రస్తుత వర్షాలతో స్థానికుల్లో ఆందోళన

కొనసాగిన వాన

● రెండేళ్లుగా వణుకుతున్న మున్నేటి పరీవాహకం ● గతేడాది భారీ నష్టాన్ని మిగిల్చిన వరద ● ప్రస్తుత వర్షాలతో స్థానికుల్లో ఆందోళన

సాక్షిప్రతినిధి, ఖమ్మం: గత ఏడాది మున్నేటికి వరద పోటెత్తగా పరీవాహక ప్రాంత కాలనీలన్నీ నీట మునిగాయి. ఈనేపథ్యాన ప్రస్తుత వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది అధికారిక లెక్కల ప్రకారం 37.5 అడుగులు, అనధికారికంగా దాదాపు 42 అడుగుల మేర మున్నేటికి వరద చేరింది. ఇక 2023లోనూ మున్నేరుకు వరద పోటెత్తింది. అయితే, గత ఏడాది ఎదురైన చేదు అనుభవాలతో అప్రమత్తంగానే ఉన్నా అటు అధికా రులు, ఇటు ప్రజల్లో ఆందోళన వీడడం లేదు.

మున్నేరు ముంచింది..

గత ఏడాది ఆగస్ట్‌ 31, సెప్టెంబర్‌ 1న వచ్చిన వరదలతో మున్నేరు పరీవాహకం మొత్తం నీట మునిగింది. 42 అడుగుల మేర వరద రావడంతో ఖమ్మం నగరంలోని 14 డివిజన్లు, ఖమ్మంరూరల్‌ మండలంలోని 20 కాలనీలు వరద ముంపు బారిన పడి దాదాపు 80 శాతం కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కొందరి ఇళ్లు పూర్తిగా ధ్వంసమై.. మరికొందరికి పాక్షికంగా దెబ్బతినడంతో పాటు ఉపకరణాలు పనికి రాకుండా పోయాయి.

2023లో 30 అడుగులకు పైగా..

గత 20 ఏళ్లలో మున్నేరు వరదను పరిశీలిస్తే అత్యధికంగా గత ఏడాదే నమోదైంది. అంతకుముందు 2023 జూలై 27న 30.70 అడుగులు, 2005లో 26 అడుగుల వరద వచ్చింది. అయితే, 2005లో మున్నేటికి ఇరువైపులా ఇన్ని కాలనీలు లేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. దాదాపు 18 ఏళ్ల తర్వాత 2023–24లో 30 అడుగుల మేరకు రావడంతో అదే అత్యధిక వరదగా నమోదైంది. కానీ 2024–25కు సంబంధించి 2024 సెప్టెంబర్‌ 1న ఊహించనంతగా 42 అడుగుల వరకు వరద రావడం గమనార్హం.

ఎప్పుడేం జరుగుతుందో..

జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మున్నేరు, ఆకేరు పరీవాహక ప్రాంత కాలనీల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత 60 ఏళ్లలో ప్రశాంతంగా ఉన్న మున్నేరు గత రెండేళ్లుగా నిద్ర లేని రాత్రులను మిగులుస్తోందని కాలనీవాసులు కన్నీటిపరంతమవుతున్నారు. ప్రస్తుతం ఎడ తెరిపి లేని వర్షాలతో అధికారుల ముందస్తు చర్యలతో జనానికి మరింత భయం కలిగిస్తోంది. ఏ క్షణమైనా పునరావాస కేంద్రాలకు వెళ్లేలా విలువైన సామగ్రిని సర్దుకుంటున్నారు.

జిల్లాలో గురువారం కూడా వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మిగతాచోట్ల ఓ మోస్తరు వర్షంతో వాగులు, చెరువుల్లోకి నీరు చేరింది. గురువారం ఉదయం 8–30 నుంచి రాత్రి 9గంటల వరకు అత్యధికంగా చింతకాని మండలం నాగులవంచలో 66 మి.మీ. వర్షపా తం నమోదైంది. ఎర్రుపాలెం మండలంలో కట్టలేరుకు వరద పెరగగా, ముదిగొండ మండలం వల్లభి పెద్ద చెరువుకు అలుగు పడింది. వైరా నది ఉధృతితో స్నానాల లక్ష్మీపురం, సిరిపురం మధ్య రాకపోకలు నిలిపివేశారు. కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌కు సాగర్‌ నుంచి నీటి విడుదల తగ్గించడమే కాక దిగువకు 2,043 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు అలుగు ద్వారా మరో 7,667క్యూసెక్కులు పాలేరు ఏటిలో కలుస్తుంది. ఈ మేరకు రిజర్వాయర్‌ నీటిమట్టం 23.45అడుగుల వద్ద నిలకడగా ఉంది. వైరా రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్ట మైన 18.3అడుగులు దాటి 19 అడుగులకు చేరింది. ఇక డోర్నకల్‌ వద్ద మున్నేరు 140 మీటర్లకు గాను 136, ఖమ్మం జిల్లా తీర్థాల వద్ద 20 అడుగులకు గాను 10, ఆకేరు తిప్పారెడ్డిగూడెం వద్ద 135 మీటర్లకు 132 మీటర్లు, ఖమ్మం కాల్వొడ్డు వద్ద మున్నేరు 7.90అడుగులుగా నమోదైంది.

పదేళ్లలో అత్యధికం.. 37.5అడుగులు1
1/1

పదేళ్లలో అత్యధికం.. 37.5అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement