
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పటిష్ట చర్యలు
ఖమ్మం సహకారనగర్: వాతావరణ శాఖ సూచనల ప్రకారం అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి పొంగులేటి, సీఎస్ రామకృష్ణారావు, ఖమ్మం కలెక్టరేట్ నుంచి తుమ్మల గురువారం కలెక్టర్లతో వీసీ ద్వారా మీక్షించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మరికొన్ని రోజులు వర్షాలు ఉన్నందున వరద ముంచెత్తినా నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సహాయక చర్యల కోసం రూ.కోటి నిధులు విడుదల చేయగా, అవసరమైతే మరిన్ని నిధులు కూడా విడుదల చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆకేరు, మున్నేరు, పాలేరు, వైరా, లంకాసాగర్‌లో వరద నిలకడగా ఉన్నప్పటికీ ఎగువ జిల్లాల్లో వర్షం వివరాలు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీసీలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, కెఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమావేశమై వర్షపాతం వివరాలు, వరద అంచనా, ముందస్తు చర్యలపైనే కాక సీజనల్ వ్యాధుల కట్టడిపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో ఏ.పద్మశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య, డీఎంహెచ్‌ఓ కళావతి బాయి, సీపీఓ శ్రీనివాస్, వివిధ శాఖల ఎస్‌ఈలు శ్రీనివాసాచారి, ఎం.వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ పాల్గొన్నారు.
వీసీలో మంత్రులు పొంగులేటి, తుమ్మల