
సప్తపదుల ఖాదీ
ఖమ్మంలో ఖాదీ గ్రామోద్యోగ్‌కు ఆదరణ
స్వాతంత్రోద్యమం నుంచి నగరంలో నిర్వహణ
సత్యం, అహింస స్వదేశీ భావాలకు ప్రతీక
గ్రామోద్యోగ్‌లోనే కొంటా..
తగ్గని ఆదరణ
ఖమ్మంగాంధీచౌక్: ఖాదీ లేదా ఖద్దరు వస్త్రాలు మహాత్మా గాంధీ నమ్మిన సత్యం, అహింస, స్వదేశీ భావాలకు ప్రతీకగా నిలిచాయి. స్వాత్రంత్య ఉద్యమంలో ఖాదీ వస్త్రాలు దేశ భక్తిని పెంపొందించాయి. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాయి. తక్కువ ధరకు లభించే ఈ వస్త్రాలు వేసవిలో చల్లదనాన్ని, చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తాయి. తొలుత నూలు వడికి మగ్గాలపై నేసేవారు. సాంకేతికత పెరిగాక యంత్ర పరికరాలపై బట్టను తయారు చేస్తున్నారు. వయసులో పెద్దవారు, రాజకీయ నాయకులు ఖద్దరు దుస్తులను ఎక్కువగా వినియోగిస్తారు. కాలక్రమంలో ఖాదీ వస్త్రాల కార్ఖానాలు వెలిశాయి. పలు రాష్ట్రాల్లో ఖాదీ పరిశ్రమలు పెరగటంతో ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. కుటీర పరిశ్రమలుగానూ వెలిశాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాదీ వస్త్రాల తయారీకి ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. ఏపీలోని పొందూరు ఖద్దరు, తెలంగాణలో వావిలాల ఖాదీ ఆదరణ చూరగొన్నాయని చెప్పొచ్చు.
విస్తరించిన వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్
స్వాతంత్రోద్యమంలో ఖాదీకి లభించిన ఆదరణ, ప్రాముఖ్యతతో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో వావిలాల గ్రామోద్యోగ్ ప్రతిష్టాపన జరిగింది. కుటీర పరిశ్రమగా ఆవిర్భవించి అంచెలంచెలుగా రాష్ట్రంలో ఎనిమిది పరిశ్రమలకు విస్తరించింది. పరిశ్రమలు, చేతి మగ్గాలు, దుకాణాల్లో దాదాపు వెయ్యి మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. కరీంనగర్, హనుమకొండ, తొర్రూరు తదితర ప్రాంతాలకు పరిశ్రమ విస్తరించగా, పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఖద్దరు విక్రయ దుకాణాలను నిర్వహిస్తున్నారు. జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, తొర్రూర్, హుజూరాబాద్, హైదరాబాద్‌లో పలు బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు చైర్‌పర్సన్‌గా దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు తనయ ఎంఎల్‌సీ సురభి వాణితో పాటు కార్యదర్శిగా వడిదల కిషన్‌రావు వ్యవహరిస్తున్నారు.
ఖమ్మం గ్రామోద్యోగ్‌కు 70 ఏళ్ల చరిత్ర
వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాపన బ్రాంచిని ఖమ్మంలో 70 ఏళ్ల కిత్రం ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలోని గాంధీ నడయాడిన గాంధీచౌక్‌లోనే ఈ బ్రాంచిని ఖాదీ గ్రామోద్యోగ్ ఎంపోరియం ఏర్పాటు చేశారు. నగరానికి చెందిన వేములపల్లి రంగారావు గ్రామోద్యోగ్‌లో ఉద్యోగిగా చేరి 40 ఏళ్ల పాటు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కృష్ణారావు 30 ఏళ్లుగా గ్రామోద్యోగ్ ఉద్యోగిగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ వంద శాతం ఖాదీ దుస్తులు పంచెలు, లుంగీలు, టవల్స్, చొక్కాలు విక్రయిస్తున్నారు. ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, కోదాడ, నల్లగొండ, ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి రెగ్యులర్ కష్టమర్లు వస్తుంటారు. ఇక రాజకీయ నాయకులు ఖద్దరు చొక్కాలు, పంచెల కోసం ప్రత్యేక ఆర్డర్లు ఇస్తారు. ఇక స్వాంతత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి, వర్ధంతి, రిపబ్లిక్ డే వంటి ప్రత్యేకమైన రోజుల్లో సంస్థ ప్రత్యేక తగ్గింపు ధరలకు ఖాదీ బట్టను విక్రయిస్తుంది. ప్రస్తుత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 30 శాతం డిస్కౌంట్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో విక్రయాలు మరికొంత పెరిగాయి.
గాంధేయ వాదులం. వావిలాల గ్రామోద్యోగ్‌లో ఖద్దరు బట్టలను కొనుగోలు చేసి చొక్కాలను ధరిస్తున్నాం. లుంగీలు, టవల్స్‌ను కూడా వాటినే వినియోగిస్తున్నాం. ఆర్యోగపరంగా కూడా ఈ బట్ట అనుకూలంగా ఉంటుంది. నాణ్యత బాగుంటుంది.
–తూములూరి లక్ష్మీనరసింహారావు, ఖమ్మం
ఖాదీ వస్త్రాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ వస్త్రాలకు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. ఖమ్మంలో 70 ఏళ్లుగా గ్రామోద్యోగ్‌ను నిర్వహిస్తున్నాం. లాభాపేక్ష లేకుండా సంస్థ ఖాదీ తయారీ, విక్రయాలు చేస్తోంది. – వేములపల్లి కృష్ణారావు, మేనేజర్,
ఖమ్మం గ్రామోద్యోగ్ ఎంపోరియం

సప్తపదుల ఖాదీ

సప్తపదుల ఖాదీ

సప్తపదుల ఖాదీ