విద్యాశాఖపై సమీక్షలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మం సహకారనగర్: ఇక నుంచి ప్రతీనెల నాలుగో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో ‘బ్యాగ్ లెస్ డే’గా నిర్వహించాలని.. ఆ రోజు క్రీడా పోటీలు, పాటలు పాడించడమే కాక మొక్కల పెంపకం, మాక్ అసెంబ్లీ ఏర్పాటుచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి సమీక్షించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్, సమగ్రాభివృద్ధి దిశగా కార్యక్రమాలు ఉండాలని తెలిపారు. పీఎంశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరైన నిధులతో పనులు పూర్తిచేయించడమే కాక రెండో యూనిఫామ్, పాఠ్య, నోట్ బుక్స్ పంపిణీ చేసి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని చెప్పారు. యూనిఫామ్ పంపిణీలో నిర్లక్ష్యం వహించే ఎంఈఓలకు మెమో జారీ చేయాలని తెలిపారు. అలాగే, హాజరు నమోదుపై సూచనలు చేసిన కలెక్టర్... గుడిసెలు, శిథిల భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలల స్థానంలో కంటైనర్లు ఏర్పాటు చేయించాలన్నారు. డీఈఓ నాగపద్మజ, ఎంఈఓలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
●ఖమ్మంగాంధీచౌక్: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఆన్‌లైన్ ర్యాండమైజేషన్ ద్వారా లబ్ధిదారులకు పారదర్శకంగా కేటాయిస్తున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కామేపల్లి మండలం పింజరమడుగు, ముచ్చర్ల ప్రాంత 50మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాక ఆయన మాట్లాడారు. త్వరలోనే వీరికి మంత్రులు, ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కామేపల్లి తహసీల్దార్ సుధాకర్, డబుల్ బెడ్‌రూం లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.