వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ కె.విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగినుల
వసతిగృహంలో ప్రవేశాలు
ఖమ్మంవన్‌టౌన్: మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఖమ్మంలో నిర్వహిస్తున్న ఉద్యోగినుల వసతిగృహంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తూ 18 – 40 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఆర్థికంగా వెనుకబడిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థినులకు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. ఈమేరకు పుట్టిన తేదీ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఉద్యోగ ధ్రువీకరణ లేదా ఉద్యోగ శిక్షణకు సంబంధించిన పత్రం, వేతన సర్టిఫికెట్‌తో తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 7901017341 నంబర్‌కు ఫోన్ చేయొచ్చని డీడబ్ల్యూఓ తెలిపారు.
12న అథ్లెటిక్స్ అకాడమీ ఎంపికలు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీలో ఎంపిక ప్రక్రియ ఈనెల 12వ తేదీన నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. బాలురకు మాత్రమే అవకాశం ఉండగా, 30 జూన్ 2009 నుంచి 1 జూలై 2011 లోపు జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 8గంటలకు అకాడమీకి చేరుకోవాలని సూచించారు.
మూడు నెలల బియ్యం పంపిణీకి సిద్ధం
బోనకల్: ఈనెలలో రేషన్‌షాప్‌ల ద్వారా ఒకేసారి మూడు నెలల సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ తెలిపారు. బోనకల్ మండలంలో పలు రేషన్‌షాపులను తహసీల్దార్ రమాదేవి, ఆర్‌ఐ నవీన్‌కుమార్, సివిల్ ప్లయీస్ తహసీల్దార్ వెంకటేశ్వర్లుతో కలిసి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లో బియ్యం నిల్వ సామర్ధ్యం, ఇతర ఏర్పాట్లను పరిశీలించిన డీసీఎస్‌ఓ మూడు నెలల బియ్యం పంపిణీ సజావుగా సాగేలా రేషన్ డీలర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. డీలర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, బియ్యం తీసుకున్న వారు అమ్మితే కార్డు రద్దు చేస్మాతని స్పష్టం చేశారు. డీలర్లు సుంకర రామారావు, బందం అచ్చయ్య, తోట లింగయ్య, వరలక్ష్మి, సత్తార్, నిర్మల, పురుషోత్తంరావు తదితరులు పాల్గొన్నారు.
3న హెచ్‌ఎంలు, ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం
ఖమ్మం సహకారనగర్: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 100శాతం నమోదైన ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలను సన్మానించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో 3వ తేదీన కలెక్టరేట్‌లో జరిగే సమావేశంలో వంద శాతం ఫలితాలు సాధించిన 66పాఠశాలల హెచ్‌ఎంలతో పాటు జిల్లా, మండల స్థాయి టాపర్లను సైతం సన్మానించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.సత్యనారాయణ తెలిపారు.
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు


