ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించండి
● తిరస్కరిస్తే అందుకు కారణాలు వెల్లడించాలి ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆదేశించారు. ఏవైనా తిరస్కరిస్తే అందుకు కారణాలను ఫిర్యాదుదారులకు తెలియచేయాలని చెప్పారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
● ఖమ్మంకు చెందిన సింగాల నాగమణి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే, బీ.కే.బజార్‌కు చెందిన ఏ.శ్రీలక్ష్మి ఒంటరినైనా తనకు ఉపాధి కల్పించచడంతో పాటు ఇల్లు ఇప్పించాలని విన్నవించారు.
● పెనుబల్లి మండలం తాళ్లపెంటకు చెందిన షేక్ ఉద్దండు సాహెబ్ తమ ఇంటి నుండి ఊరిలోకి వెళ్లకుండా కంచె ఏర్పాటుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
● ఇందిరమ్మ ఇళ్లలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీజేఏసీ చైర్మన్ పీ.వీ.చలమయ్య ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు. నాయకులు రామకృష్ణ, బ్రహ్మయ్య, వెంకట్, గోపిరాజ్, రేణుక పాల్గొన్నారు.
● రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్‌నగర్ కాలనీలో బీ.ఆర్ అంబేద్కర్ పేరుతో కమ్యూనిటీ హాల్‌ను ఏర్పాటు చేయాలని వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు.
● కేఎంసీ పరిధిలోని సమస్యల పరిష్కారం, అర్హులకు సంక్షేమ పథకాల మంజూరుపై సీపీఐ నాయకులు విన్నవించారు. సీపీఐ నగర కార్యదర్శి ఎస్.కే.జానీమియా, నాయకులు పాల్గొన్నారు.
● చింతకాని మండలం రైల్వే కాలనీలో ఇందిరమ్మ కమిటీ బాధ్యులు అర్హులకు కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని ఆరోపిస్తూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వరావు ఆధ్వర్యాన నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.


