● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ● విద్యాశాఖ అధికారులతో సమీక్షలో సూచనలు
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాటుచేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడమే కాక ఇతర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అంతకుముందే నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ డిపార్ట్‌మెంటల్ అధికారి, డిపార్ట్‌మెంటల్ అధికారులతో డీఐఈఓ రవి బాబు సమావేశమయ్యారు. కేంద్రాల వద్ద నిబంధనలు, ఏర్పాట్లపై సూచనలు చేశారు. డీఈసీ మెంబర్లు కె.శ్రీనివాసరావు, వీరభద్రరావు పాల్గొన్నారు.
22నుంచి పరీక్షలు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జిల్లాలో 15,461మంది విద్యార్థుల కోసం 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో ప్రథమ సంవత్సరం 11,780మంది, ద్వితీయ సంవత్సరం 3,681మంది ఉన్నారు. కాగా, జిల్లాను నాలు గు రూట్లుగా విభజించి, 17స్టోరేజ్ పాయింట్లు ఏర్పా టు చేశారు. ఇద్దరు చొప్పున అధికారులతో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటుచేసి ఇప్పటికే విధులపై అవగాహన కల్పించారు. కాగా, ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9నుంచి 12గంటల వర కు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2–30 నుంచి 5–30గంటల వరకు నిర్వహిస్తారు. కాగా, ఈ నెల 25న ఆదివారం కూడా పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేయగా, అక్కడి నుంచి సామగ్రి సరఫరా చేస్తారు.


