పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. ఈమేరకు ఖమ్మంలోని గోదాంకు పుస్తకాలు చేరగా, మండలాల వారీగా పంపిణీని జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. సీఎంఓ యలగందుల రాజశేఖర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రం నుంచి మండలాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు ఈ నెలాఖరులోగా అన్ని పాఠ్యపుస్తకాలను చేరవేస్తామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 4,92,970 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 3,76,380పుస్తకాలు వచ్చాయని వెల్లడించారు. మిగిలిన పుస్తకాలు, వర్క్ బుక్‌లు వారంలోగా వస్తాయని, ఇక నోటుపుస్తకాలు హైదరాబాద్ నుంచి నేరుగా పాఠశాలలకు చేరతాయని తెలిపారు. గోదాం మేనేజర్ రఫీతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.


