నిబద్ధత గల కమ్యూనిస్టు ప్రసాద్
ఖమ్మంమయూరిసెంటర్: తుదిశ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా నీడలో పోరాటం సాగించిన పోటు ప్రసాద్ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు అని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఆదివారం బోనకల్ రోడ్డులోని ఆదిత్య థియేటర్ సమీపంలో సీపీఐ జిల్లా కార్యదర్శి, దివంగత కార్మిక నేత పోటు ప్రసాద్ స్మారక స్తూపాన్ని హేమంతరావు ఆవిష్కరించారు. అంతకు ముందు స్థానిక జెడ్పి సెంటర్ నుంచి స్తూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. హేమంతరావు మాట్లాడుతూ పోటు ప్రసాద్ విద్యార్థి దశ నుంచి లౌకిక, వామపక్ష భావజాలంతో పని చేశారన్నారు. ప్రసాద్ తన చివరి కార్యక్రమాన్ని 40వ డివిజన్లో నిర్వహించారని, ఇక్కడి ప్రజలు స్తూపాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. కాగా, స్తూపం వద్ద సీపీఐ పతాకాన్ని రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బీజీ క్లెమెంట్, నాయకులు జానీమియా, పోటు కళావతి, మహ్మద్ సలాం, మేకల శ్రీనివాసరావు, పోటు రాజాసాత్విక్, పగడాల మల్లేశ్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
అసత్య ప్రచారంనమ్మొద్దు..
ఖమ్మంవ్యవసాయం: అయిల్‌పామ్ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న టీజీ ఆయిల్ ఫెడ్ (తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల రైతుల సమాఖ్య)పై పలు ప్రైవేట్ కంపెనీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సంస్థ మేనేజ్‌మెంట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రైతులను ప్రోత్సహించి, నాణ్యమైన మొక్కలు అందించి, తాజా పండ్ల గుత్తులకు మార్కెట్ లింకేజీ కల్పించి, ఆయిల్‌పాం పంటను విస్తరిస్తున్నామని పేర్కొంది. ఇందుకు వ్యతిరేకంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు అసత్య ప్రచారం చేస్తూ సంస్థ ఖ్యాతిని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నాయని, దీనిని ఎవరూ నమ్మొద్దని సూచించింది.
అగ్ని ప్రమాద మృతులకు సంతాపం
ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ పాత నగరంలోని చార్మినార్ గుల్జార్ హౌస్ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అగ్ని ప్రమాదం బాధాకరమని, బాధితులను ఆదుకోవాలని కోరారు.
9 ఇసుక లారీల పట్టివేత
ఖమ్మంక్రైం: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్లను ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. గంధసిరి నుంచి నగరంలోకి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ల్‌ను రాపర్తివంతెన వద్ద, ఐదు ట్రాక్టర్లను ప్రకాష్‌నగర్ వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి టూటౌన్, త్రీటౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిసింది.
పెళ్లికి వినూత్న ఆహ్వానం
పాల్వంచ: పట్టణంలోని గోవర్దనగిరికాలనీకి చెందిన ఏనుగు రవీందర్‌రెడ్డి, జ్యోతి దంపతులు వారి కూతురు గౌతమిని సుజాతనగర్ వేపలగడ్డకు చెందిన తాళ్ల శ్రీనివాస్‌రెడ్డికి ఇచ్చి ఆదివారం వివాహం చేశారు. అయితే, ఈ పెళ్లిపత్రికను గుడ్డసంచిపై ముద్రించి అందులో కార్డు పెట్టి పంచారు. ‘ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం’ అందులో ప్రింట్ చేయించారు. వివాహం ఆద్యంతం ప్లాస్టిక్ వాడకుండా ఉండటంతో అందరూ అభినందించారు.
శ్రీకనకదుర్గమ్మకు
విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
నిబద్ధత గల కమ్యూనిస్టు ప్రసాద్


