సేంద్రియ సాగుపై దృష్టి
జీవాల ఎరువు దుక్కికి బలం
● ఇతర జిల్లాల నుంచి వలసవచ్చి ఎరువు చేర్చి సంపాదిస్తున్న కురములు ● జీవాల ఎరువు కోసం పోటీ పడుతున్న రైతులు ● ఆధిక దిగుబడులు వస్తాయంటున్న అన్నదాతలు
బోనకల్: పెరిగిన పెట్టుబడులు.. తగ్గుతున్న దిగుబడులు.. భూసార లోపాన్ని ఆధిగమించేందుకు అన్నదాతలు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. గతంలో పాడి పశువుల ఎరువును పొలాలకు ఎరువుగా ఉపయోగించుకునేవారు. తగ్గిన పశు సంపద వల్ల రైతులు తమ పొలాలకు ఎరువును వేయలేకపోవడంతో భూసారం తగ్గి దిగుబడులు పడిపోతున్నాయి. దీంతో రైతులు జీవాల ఎరువుపై దృష్టి సారించారు. కొందరు యాదవులకు ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయడంతో వాటిని పొలాల్లో ఎరువుల కోసం ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కురుమ, యాదవులు మేత కోసం గొర్రెలను బోనకల్ మండలం తీసుకొచ్చారు. ఉదయం మేతమేపుతూ రాత్రి సమయాల్లో వాటిని ఎరువు కోసం ఉంచుతున్నారు. 2000 జీవాలు ఒక రోజు ఉంచితే ఎకరం పొలానికి ఎరువు సరిపోతుంది. ఇందుకు గాను రైతుకు రూ.1500 నుంచి రూ.2000 ఖర్చవుతుంది. తక్కువ ఖర్చుతో పొలం సారవంతంగా తయారవుతుందని అన్నదాతలు వాటి కోసం పోటీ పడుతున్నారు. పొలంలో గొర్రెలు, మేకల మంద వదిలితే పేడ, మూత్రం, వెంట్రుకల వల్ల భూమికి సేంద్రియ పదార్థం లభిస్తుంది. గొర్రె పేడలో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మెక్కల వేర్లు భూమిలోపలికి సులువుగా వెళ్లి తొందరగా మొక్క ఎదుగుతుందని రైతులు చెబుతున్నారు. వాటి మూత్రం పీహెచ్ 7.7 ఉండడం వల్ల భూమిలో ఉన్న చౌడు కూడా పోయి సారవంతంగా తయారవుతుంది. భూమి గుల్లబారడంతో పాటు ఒక లీటరు మూత్రంలో 3 నుంచి 13 గ్రాముల నత్రజని, 18 నుంచి 20 గ్రాముల పొటాషియం, పాస్పరస్ ఉంటాయి. గొర్రె లేదా మేక ఒక రాత్రికి లీటరు మూత్రం విసర్జిస్తుంది. ఈ ఎరువు వల్ల భూమిలో తేమశాతం నిల్వ ఉండి తడులు తక్కువగా పడతాయి. ఒక్క ఏడాది ఎరువు వస్తే మూడేళ్ల వరకు ఎరువు అవసరం ఉండదని రైతులు అంటున్నారు.


