మద్యం ధరలకు రెక్కలు
● క్వార్టర్‌పై రూ. 10, ఫుల్ బాటిల్‌కు రూ.40 పెంపు ● నేటి నుంచి అమలుకు రంగం సిద్ధం
వైరా: మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గత నవంబర్‌లో బీరు ధరలు పెంచిన సర్కార్.. ఆరు నెలలకే లిక్కర్ ధరలు కూడా పెంచడంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లు పెట్టినట్టయింది. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. చీప్ లిక్కర్ నుంచి అన్ని రకా ల మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. క్వార్టర్ (180 ఎంఎల్) సీసాపై రూ.10 పెంచగా, హాఫ్ బాటిల్‌కు రూ. 20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం కూడా ఒకటి. గతంలో బీర్ల ధర రూ. 20 నుంచి రూ. 40 వరకు పెంచడంతో ఈ ఏడాది గతంలో ఏన్నాడూ లేనంతగా బీర్ల అమ్మకాలు సగానికి పైగా తగ్గాయి. మళ్లీ అన్ని బ్రాండ్ల లిక్కర్ రేట్లు పెంచడంతో అమ్మకాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
నేడు మద్యం డిపోలో బిల్లింగ్ ఆలస్యం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మద్యం సరఫరా అయ్యే వైరాలోని మద్యం డిపోలో వ్యాపారులు బిల్లింగ్ కోసం వస్తుంటారు. పెరిగిన ధరల జాబితా ఆన్‌లైన్‌లో ఆప్‌డేట్ అయ్యేందుకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం తర్వాత సర్వర్‌లో మార్పులు చేసి పూర్తి స్థాయిలో ధరల జాబి తాను వ్యాపారులకు అందించే అవకాశం ఉంటుందని డిపో అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో పెంచిన ధరల జాబితా చక్కర్లు కొడుతోంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయంతో మద్యం ప్రియులపై ధరల పిడుగు పడిందని చెప్పొచ్చు.
మద్యం ప్రియుల ‘బారు’లు
ఖమ్మంక్రైం : పెరిగిన మద్యం ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని పలు వైన్స్, బార్ షాపుల ఎదుట మద్యం ప్రియులు బారులుదీరారు. క్వార్టర్‌కు రూ.10, హాఫ్ రూ.20, ఫుల్ బాటిల్‌కు రూ.40 చొప్పున పెరుడుతుండడంతో పలువురు మద్యం కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు.
మద్యం ధరలకు రెక్కలు


