మీటర్లు గిరగిరా...
ఖమ్మంవ్యవసాయం: ఎండలు మండుతున్న వేళ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో డిస్కం కేటాయింపునకు మించి విద్యుత్ వినియోగం జరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ వినియోగం లేకున్నా, గృహ వినియోగం నానాటికీ పెరుగుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. సర్కిళ్ల పరిధిలో సర్వీసులు, వాటి సామర్ధ్యం, సీజన్ల వారీగా వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని డిస్కం నుంచి కోటా కేటాయిస్తారు. ఈ ఏడాది మార్చి నుంచి ఎండ తీవ్రత మొదలుకాగా, ఏప్రిల్ చివరి వారానికి తీవ్రరూపం దాల్చింది. గతనెల 26న జిల్లాలో గరిష్టంగా 43.1 డిగ్రీలు, ఈనెల 13న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిగతా రోజుల్లోనూ 40–45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఆ ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది.
తగ్గిన కోటా.. పెరిగిన వినియోగం
ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో వివిధ కేటగిరీల కింద మొత్తం 6,96,179 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఇందులో గృహ సర్వీసులు 4,96,114 కాగా, వ్యవసాయ సర్వీసులు 1,19,345.. మిగిలినవి ఇతర కేటగిరీల్లో ఉన్నాయి. మార్చి ఏప్రిల్ వరకు గృహ, పరిశ్రమల వినియోగంతో పాటు యాసంగి పంటల సాగులో భాగంగా మోటార్లు వినియోగించారు. దీంతో సర్కిల్‌కు నిత్యం 5.97 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశారు. మే ఆరంభం నాటికి యాసంగి పంటల కోతలు పూర్తవడంతో విద్యుత్ కోటాను 4.93 మిలియన్ యూనిట్లను తగ్గించారు. అంటే మార్చి, ఏప్రిల్ నెలలతో పోలిస్తే మే నెల కోటా 1.04 మినియన్ యూనిట్లు తగ్గింది. వ్యవసాయ వినియోగం లేదని ఈ నిర్ణయం తీసుకోగా.. ఎండల కారణంగా గృహ వినియోగం పెరగడంతో పలుచోట్ల అంతరాయాలు, లోఓల్టేజీ సమస్యలు ఎదురవుతున్నాయి.
ఉష్ణోగ్రతలతో పాటే పెరుగుతున్న విద్యుత్ వినియోగం
జిల్లాలో డిస్కం కోటాకు మించి వాడకం
వ్యవసాయ ఉపయోగం లేకున్నా
గృహాల్లో ౖపైపెకి...
ఉపశమనం కోసం..
ఎండ తాపం నుంచి ఉపశమనం కోసం దాదాపు అందరూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగిస్తున్నారు. పగలు, రాత్రీ లేకుండా కూలర్లు, ఏసీలు నడుస్తుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈనెలలో ఉష్ణోగ్రతలు పెరగగా... విద్యుత్ వినియోగం కోటాకు మించి నమోదవుతోంది. ఖమ్మం సర్కిల్‌కు నిత్యం 4.93 మిలియన్ల యూనిట్ల విద్యుత్ కోటా కేటాయిస్తే.. గరిష్టంగా 5.82 యూనిట్ల మేర వినియోగం జరుగుతుండడం గమనార్హం. ఈ లెక్కన సర్కిల్‌లో కోటాకు మించి అదనంగా 18 శాతం విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
వినియోగానికి అనుగుణంగా సరఫరా
ఉష్ణోగ్రతల కారణంగా కొద్ది రోజులుగా విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో కోటాతో ప్రమేయం లేకుండా జిల్లాకు అవసమైన సరఫరా ఇస్తున్నారు. జిల్లాలో ఎక్కడా సమస్య ఎదురుకాకుండా వినియోగదారుల అవసరాల మేరకు సరఫరా జరిగేలా పర్యవేక్షిస్తున్నాం.
– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ


